Site icon NTV Telugu

Rahul Gandhi: ‘‘మా విజన్ స్వీకరించినందుకు సంతోషం’’.. కుల గణనపై రాహుల్ గాంధీ..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపుతో పాటు ‘‘కుల గణన’’ చేస్తామని బుధవారం సంచలన ప్రకటన చేసింది. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ ఒత్తిడి మేరకే కేంద్రం తలొగ్గిందని, కుల గణనకు అంగీకరించిందని ఆయన అన్నారు. ‘‘మేము కుల గణన నిర్వహిస్తామని పార్లమెంట్‌లో చెప్పాము. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని కూడా రద్దు చేస్తామని అన్నాము. నరేంద్రమోడీ కేవలం 4 కులాలు ఉన్నాయని మాత్రమే చెప్పేవారు. ఏం జరిగిందో తెలియదు కానీ, 11 ఏళ్ల తర్వాత కులగణనను ప్రకటించారు. ’’ అని అన్నారు. కులగణనపై ఎంత టైమ్ పడుతుందో కావాలని, దీనిపై మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నామని అన్నారు.

Read Also: Simhachalam Incident: సింహాచలం ఘటనపై ఎంక్వైరీ కమిషన్‌.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు..

ఇది మొదటి అడుగు మాత్రమే అని, తెలంగాణ కుల గణన కేంద్ర ప్రభుత్వానికి ఒక నమూనాలా, బ్లూ ఫ్రింట్‌గా మారవచ్చని ఆయన అన్నారు. కుల గణనకు ఈ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తున్నామని, కుల గణనకు రెండు ఉదాహరణలు ఒకటి తెలంగాణ, రెండోది బీహార్ అని, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉందని రాహుల్ చెప్పారు. కుల గణన ద్వారా రిజర్వేషన్లు మాత్రమే కాదని, కొత్త అభివృద్ధి నమూనాను తీసుకురావడమే తమ దృక్ఫథమని అన్నారు. దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు వారి భాగస్వామ్యం ఎంత అనేది కుల గణన ద్వారా కనుగొనబడుతుందని చెప్పారు. ఆర్టికల్ 15(5) ప్రకారం, ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఇప్పటికే చట్టంగా ఉందని, ఎన్డీయే బీజేపీ ప్రభుత్వం దీనిని అమలు చేయాలని రాహుల్ గాంధీ కోరారు.

ఉగ్రవాదంపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. పెహల్గామ్ దాడికి పాల్పడినవారు సరైన మూల్యం చెల్లించుకోవాలని, ఉగ్రవాదంపై పోరుకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రధాన మంత్రి ఊగిసలాడకూడదని, అరకొర చర్యలు తీసుకోరాదని, పెహల్గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన వారిని ‘‘అమరవీరులు’’గా గుర్తించాలని కోరారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబీకులు తన ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

Exit mobile version