Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..

  • ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను చంపింది మేమే..
  • వెలుగులోకి వచ్చిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ఆడియో..
  • డ్రగ్స్, ఆయుధాల రవాణా కారణాల వల్లే హత్య చేసినట్లు వెల్లడి..
Nijjar

Nijjar

Nijjar Killing: ఖలిస్తానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ కెనడాల్లోని సర్రే ప్రాంతంలో గురుద్వారా ముందు 2023లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్య వివాదంగా మారింది. ఈ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే, దీనిని భారత్ తీవ్రంగా తప్పపట్టింది. రెండు దేశాలు కూడా తమ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవడం ఆ సమయంలో ఉద్రిక్తతల్ని పెంచాయి. కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్-కెనడాల మధ్య సంబంధాలు మళ్లీ గాడినపడ్డాయి.

ఇదిలా ఉంటే, ఈ హత్యకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. తామే నిజ్జర్‌ను హత్య చేశామని గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ చెప్పినట్లు లీకైన ఒక ఆడియో టేప్ సంచలనంగా మారింది. యూకేకు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది పరమ్‌జిత్ సింగ్ పమ్మాతో మాట్లాడుతున్న సమయంలో బ్రార్ ఈ హత్యకు సంబంధించిన కారణాలు వెల్లడించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. డ్రగ్స్ విక్రయాల కోసం 16-17 ఏళ్ల యువకులను ఉపయోగించేందుకు నిజ్జర్ మద్దతు ఇచ్చేవాడని, డ్రగ్స్ విక్రయించేందుకు యువకుల్ని బ్లాక్‌మెయిల్ చేసే వాడని, వారిని ఇన్‌ఫార్మర్లుగా ఉపయోగించే వాడని బ్రార్ ఆరోపించినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా నిజ్జర్ అక్రమ ఆయుధాల వ్యాపారంలో కూడా పాల్గొనే వాడని బ్రార్ ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్లే నిర్జర్‌ను హత్య చేసినట్లు చెప్పాడు.