Gold Smuggling at Mumbai airport: విదేశాల నుంచి బంగారం, డ్రగ్స్ అక్రమ రవాణా ఆగడం లేదు. విమానాశ్రయాలే కేంద్రంగా ఇప్పటికే చాలా మంది నిందితులు పట్టుబడ్డారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రూ.32 కోట్ల విలువైన 61 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. విదేశాల నుంచి ముంబాయికి చేరుకున్న ఏడుగురు ప్రయాణికులు వద్ద బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు కస్టమ్స్ అధికారు. అధికారుల కళ్లుగప్పి గోల్డ్ బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది స్మగ్లింగ్ ముఠా.
Read Also: Barren Land Into Forest: ఓ వ్యక్తి 20 ఏళ్ల కృషి.. బంజరు భూమిని పచ్చని అడవిగా మార్చింది.
పథకం ప్రకారం 61 కేజీల బరువు ఉన్న బిస్కట్లను 7 భాగాలుగా చేసి నడుము బెల్టులో దాచి తరలించే యత్నం చేశారు. దీని కోసం స్పెషల్ గా అరబ్ కంట్రీలో నడుము బెల్లులను తయారు చేయించారు కేటుగాళ్లు. అయితే ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు దృష్టి మరల్చేందుకు కస్టమ్స్ అధికారులతో వాగ్వాదానికి దిగింది స్మగ్లర్స్ గ్యాంగ్. అయితే చాకచక్యంగా వ్యవహరించిన కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఆఫ్రికా దేశం టాంజానియా నుంచి దోహా మీదుగా ముంబైకి వచ్చారు స్మగ్లర్లు. దోహా ఎయిర్ పోర్టులో బంగారు బిస్కట్లతో ఉన్న నడుము బెల్టును సూడాన్ జాతీయుడు స్మగ్లర్లకు అప్పగించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. గోల్డ్ ను ముంబాయిలోని ఎవరికి ఇవ్వడానికి తీసుకువచ్చారు..? అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టుబడ్డ స్మగ్లర్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ముంబాయి ఎయిర్ పోర్టులో ఇంతపెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారి.