Godse photo at Ganesh Visarjan: ఇటీవల మతపరమైన ఉద్రిక్తతలకు కర్ణాటక కేరాఫ్ గా మారుతోంది. వరసగా ఏదో వివాదం ఆ రాష్ట్రంలో చెలరేగుతూనే ఉంది. హిజాబ్ అంశం తరువాత, వరసగా బీజేపీ కార్యకర్తల హత్యలు, శివమొగ్గలో వీర్ సావర్కర్ పోస్టర్ వ్యవహారం ఇలా ఏదో ఒక వివాదంతో దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా మరో ఘటన కర్ణాటకలో జరిగింది. వినాయక నిమర్జన వేడుకల్లో నాథూరామ్ గాడ్సే ఫోటోలతో ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. రైట్‌వింగ్ గ్రూపుకు చెందిన కొందరు కార్యకర్తలు నాథూరామ్ గాడ్సే ఫోటోలను ప్రదర్శించారు.
Read Also: BJP: టార్గెట్ 2024 ఎలక్షన్స్.. ఈ రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇంఛార్జులు వీరే…
ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగింది. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే ఫోటోలతో గణేష్ నిమర్జన కార్యక్రమంలో ప్రదర్శించారు. ఇటీవల శివమొగ్గలోని అమీర్ అహ్మద్ సర్కిల్ వీర్ సావర్కర్, టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీల వివాదం చెలరేగిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. భారత స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఘనంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీంట్లో భాగంగా శివమొగ్గ అహ్మద్ సర్కిల్ లోని ఓ చోట సావర్కర్ ఫ్లెక్స్ కట్టేందుకు ఓ వర్గం ప్రయత్నించగా.. మరో వర్గం అభ్యంతరం తెలిపింది. అక్కడ టిప్పు సుల్తాన్ ఫ్లెక్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాజాగా గణేష్ నిమర్జనం కార్యక్రమంలో గాడ్సే ఫోటోలు దర్శనిమిచ్చాయి. అంతకుముందు ‘‘హర్ ఘర్ తిరంగా’’ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి జాతీయపతాకాన్ని, గాడ్సే ఫోటోను ఓ జీపులో పెట్టి ఊరేగించారు.