Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!

Godhra Case

Godhra Case

Godhra Case: 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇర్ఫాన్ సిరాజ్ పాడోకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసింది. తీవ్రవైమన గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం, ఇప్పటికే 18 ఏళ్లు జైలులో ఉండటం అనే అంశాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు, వైద్య కారణాల వల్ల అతడి జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇర్ఫాన్ పాడోకు సంబంధించిన అప్పీల్ 2018 నుంచి పెండింగ్‌లో ఉంది.

ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం నేరంతో తీవ్రతను ప్రస్తావిస్తూ కేసులో మెరిట్స్ ఆదారంగా ఉపశమనం కల్పించడాన్ని వ్యతిరేకించింది. అయితే, ఇర్ఫాన్ పాడో ఆరోగ్య సమస్యలు వాస్తవమైనవిగా ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కేవలం వైద్యపరమైన కారణాలతో బెయిల్ ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

గోద్రా కేసు..

2002 ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు లోని ఎస్-6 బోగీకి నిప్పటించారు. ఈ ఘటనలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఘటన తర్వాత గుజరాత్ వ్యాప్తంగా మతకల్లోలాలు చెలరేగాయి. ఈ కేసు విచారణ తర్వాత 2011లో ప్రత్యేక న్యాయస్థానం 31 మందిని దోషులుగా నిర్ధారించింది. వీరిలో కొందరికి జీవిత ఖైదు శిక్ష విధించారు . ప్రస్తుతం ఇర్పాన్ పాడో కూడా జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.