గోవాలో కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ రమేష్ తవాడ్కర్ షాకిచ్చారు. బీజేపీలోకి ఫిరాయించిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ హస్తం పార్టీ ఇచ్చిన పిటిషన్‌ను కొట్టేశారు. దీంతో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊపిరిపీల్చుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, అలీక్సో సిక్వేరా, సంకల్ప్ అమోన్కర్, మైఖేల్ లోబో, డెలీలా లోబో, కేదార్ నాయక్, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, రాజేష్ ఫల్దేశాయి బీజేపీలో చేరారు. వీరిపై గోవా కాంగ్రెస్ మాజీ చీఫ్ గిరీష్ చోడంకర్ అనర్హత పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ సభ్యత్వాన్ని వదులుకున్నారనే కారణంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం పదో షెడ్యూల్‌లోని పారా 2 కింద అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను చోడంకర్ కోరారు. ఈ కేసులో అసలు రాజకీయ పార్టీ విలీనమే లేదని చోడంకర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
తాజాగా శుక్రవారం చోడంకర్ పిటిషన్‌ను కొట్టివేస్తూ స్పీకర్ తవాడ్కర్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికైన సభ్యుని అసలు రాజకీయ పార్టీని మరొక రాజకీయ పార్టీలో విలీనం చేసిన తర్వాత.. ఎన్నికైన సభ్యుడు ఆకస్మిక పరిస్థితుల్లో అనర్హతను ఎదుర్కోరు. అంటే అతను విలీనానికి వెళ్లాలని ఎంచుకున్నా లేదా దానితో విభేదించినా కుదరదు.’’ విలీనమైతే ఫిరాయింపుల కారణంగా అనర్హత వేటు పడదని స్పీకర్ తవాద్కర్ తీర్పు చెప్పారు.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్న ప్రియాంక గాంధీ