Site icon NTV Telugu

Congress: కూలైన జీ23 లీడర్స్..!

జీ-23 కాంగ్రెస్ అసమ్మతి నేతల వరుస భేటీలు దేశ రాజకీయాల్లో కాకరేపాయి. రెబల్స్‌ నేతల సమావేశాలపై హాట్‌హాట్‌గా చర్చలు, విశ్లేషణలు సాగాయి. అయితే వరుస భేటీలతో హీట్‌ పెంచిన సీనియర్లు మొత్తానికి చల్లబడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ భేటీ అయ్యారు. 10 జనపథ్‌లోని ఆమె నివాసంలో సమావేశమై గంటకు పైగా పలు కీలక అంశాలపై చర్చించారు. సోనియాతో ముఖ్యంగా ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆజాద్‌ చర్చించారు. పార్టీలో నాయకత్వ మార్పు అంశంపై జీ23 సభ్యుల అభిప్రాయాలను వివరించారు. భేటీ అనంతరం ఆజాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీతో భేటీ సంతృప్తికరంగా సాగిందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై అభిప్రాయాల్ని పంచుకునేందుకే ఆమెతో భేటీ అయినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని, ప్రతిపక్షాలను ఓడించే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు చెప్పారు. కాంగ్రెస్ నేతలంతా సోనియా గాంధీ నేతృత్వంలో ముందుకు సాగేందుకు సుముఖంగా ఉన్నారని, కొన్ని సలహాలు మాత్రం ఆమెతో పంచుకున్నట్లు వెల్లడించారు. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సలహాలు ఇచ్చానని ఆజాద్ వెల్లడించారు.

Read Also: Weather Update: భానుడి భగభగలు.. 3 రోజులు జాగ్రత్త..

అయితే గాంధీలు తప్పుకోవాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. ఆ తర్వాత ఆజాద్‌ నివాసంలో జీ-23 నేతల వరుస భేటీలు పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో ఓటమి బాధ్యత ఎవరు తీసుకుంటారని పార్టీ సీనియర్ మనీశ్ తివారి ప్రశ్నించడం పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే ఆజాద్‌ సోనియాతో భేటీ అయి ఆమె నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పడంతో ఈ ఎపిసోడ్‌కు పుల్‌స్టాఫ్‌ పడినట్లు అయ్యింది. మరోవైపు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరణ్ సింగ్‌ను కలిశారు. ఢిల్లీలోని కరణ్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. కరణ్ సింగ్ ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ఆజాద్‌ను మీడియా ప్రతినిధులు భేటీకి గల కారణాన్ని ప్రశ్నించారు. కరణ్ సింగ్‌కు హోలీ శుభాకాంక్షలు చెప్పేందుకు ఆయన ఇంటికి వచ్చానన్నారు ఆజాద్‌. ఈ విషయాన్ని ఎక్కువగా తీసుకోవదన్నారు. G23 నేతల వరుస సమావేశాల తర్వాత… ఆజాద్‌ కరణ్ సింగ్‌ను కలవడం కొత్త చర్చకు దారితీసింది. హోలీ శుభాకాంక్షలు చెప్పడానికేనా లేక మరేదైనా కారణం ఉందా అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version