Instagram reel: ఇటీవల కాలంలో యువతకు రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరుకుంది. కొన్ని సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా కొందరికి తెలియడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ యువకుడు పోలీస్ జీపుతో ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసి చిక్కుల్లో పడ్డారు. అతను చేసిన రీల్ వైరల్ కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది.
Read Also: Israeli flight: థాయ్‌లాండ్ నుంచి ఇజ్రాయిల్ వెళ్తున్న ఫ్లైట్ హైజాక్‌కి యత్నం..
పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సమయంలో మొయిన్ ఖాన్ అనే వ్యక్తి కూల్‌డ్రింక్ చేతిలో పట్టుకుని పోలీస్ జీపు నుంచి దిగుతున్నట్లుగా ఓ రీల్ చేశాడు. జీపు డ్రైవర్ సీట్ నుంచి అతను బయటకు దిగుతున్న రీల్ వైరల్ అయింది. ఇందిరాపురం ప్రాంతంలో ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో అధికారులు ఉండగా.. వారి జీపుతో మొయిన్ ఖాన్ వీడియో తీశాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ వస్తుండగా, స్టైల్‌గా వీడియో తీసుకుని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.
ఫిబ్రవరి 15 పోస్ట్ చేసిన ఈ రీల్ వైరల్ అయింది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. తాము ఇందిరాపురంలోని కనవాని బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసే పనిలో ఉండగా.. ఖాళీగా ఉన్న జీపును చూసి సదరు యువకుడు రీల్ చేశాడని అధికారులు వెల్లడించారు.