NTV Telugu Site icon

Booster Dose: నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్

Vaccine Booster Dose

Vaccine Booster Dose

కరోనా అంతానికి భారత్ మరో కీలక ముందడుగు వేసింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించనుంది. శుక్రవారం నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభం కానుంది. బుధవారం కేంద్రం ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. జూలై 15 నుంచి 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది.

భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ కాల్ సందర్భంగా దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారందరికి ఉచితంగా బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. గతేడాది ప్రారంభం అయిన వ్యాక్సినేషన్ ప్రక్రియ విడతల వారీగా అర్హులైన వారందరికీ ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 199 కోట్ల డోసుల టీకాలను అందించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా బూస్టర్ డోస్ టీకాను ఇవ్వనున్నారు.

Read Also: Rishi Sunak: యూకే ప్రధాని రేసులో రిషి దూకుడు.. రెండో రౌండ్‌లోనూ ముందంజ

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రెండో డోస్ వ్యాక్సినేషన్ కు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ మధ్య కాలాన్ని తొమ్మిది నెలలు లేదా 39 వారాల నుంచి ఆరు నెలలు లేదా 26 వారాలకు కుదించారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ సిఫారసుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి దేశంలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఉచిత బూస్టర్ డోస్ అందుబాటులో ఉంది. కేంద్రం నిర్ణయంతో నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం దేశంలో ఇప్పటి వరకు 18-59 మధ్య వయస్సు గల 77 కోట్ల జనాభాలో 1 శాతం కన్నా తక్కువ మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారు.

Show comments