NTV Telugu Site icon

Mandi: కార్యకర్తలకు బీజేపీ నేత జైరామ్ ఠాకూర్ సమోసా పార్టీ

Mandi

Mandi

హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాలను సమోసా వివాదం కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ వ్యవహారం రచ్చరచ్చ చేస్తోంది. ఇప్పటికే నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సమోసాల మిస్సింగ్‌పై అధికార కాంగ్రెస్ పార్టీ సీఐడీ విచారణకు ఆదేశించడం పెను దుమారం చెలరేగింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించింది. తాజాగా సమోసా వివాదం నేపథ్యంలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత జైరామ్ ఠాకూర్ సమోసా పార్టీ ఇచ్చారు. మండిలోని సర్క్యూట్ హౌస్‌లో బీజేపీ కార్యకర్తలతో కలిసి సమోసా పార్టీ ఆస్వాధించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే..
అక్టోబర్ 21న ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమం కోసం ప్రముఖ హోటల్‌ నుంచి సమోసాలు తెప్పించారని, అయితే వాటిని సెక్యూరిటీ సిబ్బంది తినేసినట్లుగా వార్తలు హల్‌చల్ చేశాయి. సీఎం దగ్గరకు చేరాల్సిన సమోసాలు, కేక్‌లు మధ్యలో ఎలా దారి తప్పాయో గుర్తించేందుకు సీఐడీ విచారణకు సీఎం ఆదేశించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రతిపక్ష బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేసింది. వాటిని ఇతరులు తింటే ఏమవుతుందని ప్రశ్నించింది. సీఎం తినాల్సిన సమోసాలను తీసుకెళ్లిందెవరు..? సీఐడీ తేల్చనుంది..?’’ అని బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుండటంతో సీఎం సుఖు క్లారిటీ ఇచ్చారు.

అసలు ఇలాంటిది ఏమీ జరగలేదని తేల్చారు. సమోసాల వ్యవహారంపై సీఐడీ విచారణ జరుపుతున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. సీఐడీ విచారణ చేస్తున్న అంశం వేరు అని చెప్పారు. మీడియాలో మాత్రం సమోసాలపై సీఐడీ విచారణ అంటూ ప్రచారం చేస్తున్నారని సుఖు మండిపడ్డారు.

ఇదే వ్యవహారంపై సీఐడీ అధికారులు కూడా స్పందించింది. ఇదంతా సీఐడీ అంతర్గత వ్యవహారం అని తేల్చారు. దీనిని రాజకీయం చేయొద్దని కోరింది. ముఖ్యమంత్రి సమోసాలు తినరని.. తాము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని… అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకే విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఈ విషయంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సీఐడీ పేర్కొంది. అయినా ఈ సమాచారం ఎలా లీక్‌ అయిందో కూడా తెలుసుకుంటామని సీఐడీ డీజీ సంజీవ్‌ రంజన్ స్పష్టం చేశారు.