NTV Telugu Site icon

Sanatan Dharma remark: ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేలపై ఎఫ్ఐఆర్..

Udhayanidhi Stalin

Udhayanidhi Stalin

Sanatan Dharma remark: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, డీఎంకే పార్టీపై విరుచుకుపడుతోంది. ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా డీఎంకే పార్టీ ఉండటంతో, హిందూమతాన్ని ఇండియా కూటమి ద్వేషిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై ఇండియా కూటమి సైలెంట్ గా ఉంది. కాంగ్రెస్ అన్ని మతాలను గౌరవించాలని వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉంటే ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ పై, అతని వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాదుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది.

Read Also: Arun Kumar Sinha: SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అధికారి అరుణ్ కుమార్ సిన్హా మరణం

మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరిపై IPC సెక్షన్లు 295 A (ఉద్దేశపూర్వకంగా మరియు ద్వేషపూరిత చర్యలు) మరియు 153 A (వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద కేసు నమోదు చేశారు. న్యాయవాదులు హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోధి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై ఎప్ఐఆర్ బుక్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

చెన్నైలో జరిగిన రచయితల సమావేశంలో మాట్లాడుతూ ఉదయనిధి సనాతన ధర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం డెంగీ, మలేరియా వంటిదని దీన్ని నిర్మూలించాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లవెత్తాయి. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ ఉదయనిధి సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.