Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై కేసు నమోదైంది. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో దీప్కేతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించడం, తరగతులకు అంతరాయం కలిగించడం, ఉపాధ్యాయుల్ని బెదిరించడం వంటి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది.
లాతూర్ లోని ఆసా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జవళి సమీపంలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలు సయ్యద్ షమ్షద్‌బానో ఖైరతాలీ (53) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీజేపీ చేపట్టిన ‘‘స్కూల్ ఠీక్ కరో’’ కార్యక్రమంలో భాగంగా లాతూర్‌లోని ప్రభుత్వం పాఠశాలలను సందర్శిస్తున్నారు. ఈ పర్యటనల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావిస్తున్నారు.
ఆసా సమీపంలోని జవళి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలను సందర్శించి అభిజిత్ దీప్కే టీమ్, ఉపాధ్యాయుల్ని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు విద్యార్థుల మధ్య కూర్చొని వారిని ప్రశ్నిస్తున్నట్లు ఆరోపించారు. దీని వల్ల తరగతులు, పాఠశాల అధికారిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీప్కే పాఠశాలలో జరిగిన విషయాలను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు కూడా ఫిర్యాదులో ఆరోపించారు. ఇదే కాకుండా మరో పాఠశాల విద్యార్థుల్ని తీసుకొచ్చి తరగతి గదుల్లో కూర్చోబెట్టారని దీప్కే ఆరోపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 132, 329(3), 351(2), 356(2) కింద కేసు నమోదు చేశారు.

