Mahua Moitra: ‘‘క్యాష్ ఫర్ క్వేరీ’’ కేసులో టీఎంసీ మహువా మోయిత్రా ఈ రోజు పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ ముందు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం రసాభాసగా మారినట్లు తెలుస్తోంది. మోయిత్రాకు అండగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. ప్యానెల్ తప్పుడు ప్రశ్నలు అడుగుతోందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో పాటు మహువా మోయిత్రా సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
ఇది ఎథిక్స్ కమిటీనా..? స్క్రిప్ట్ నుంచి చదవడం అని మహువా మోయిత్రా అన్నారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన ప్రతిపక్ష ఎంపీలు కూడా ప్యానెల్ మోయిత్రాను అనైతిక ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ ప్రశ్నలు అనైతికంగా ఉన్నాయని మేము గుర్తించామని కాంగ్రెస్ ఎంపీ, ప్యానెల్ లో సభ్యుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అతను ఎవరి ఆదేశాలతో వ్యవహరిస్తున్నారో తెలుస్తోందని, పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. ఎక్కడికి వెళ్లారు..? ఎక్కడ కలిశారు.? మీరు మీ ఫోన్ రికార్డులను ఇవ్వగలరా..? అంటూ ప్రశ్నించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జేడీయూ ఏంపీ గిరిధారి యాదవ్ మాట్లాడుతూ.. మహువా వ్యక్తిగత ప్రశ్నలు అడిగే హక్కు ప్యానెల్‌కి లేదని అన్నారు.
Read Also: Bombay High Court: బిడ్డను కిడ్నాప్ చేశాడని కన్నతండ్రిపై కేసు పెట్టలేం..
ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి మాట్లాడుతూ.. మోయిత్రా ప్రవర్తన ఖండించేలా ఉందని, ఆమె ఎథిక్స్ ప్యానెట్ ముందు అన్ పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించారని ఆరోపించారు. కమిటీ చైర్‌పర్సన్ హీరానందానీ అఫిడవిట్ పై ప్రశ్నలు అడుగుతున్నారని, అందుకు ఆమె సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదని అన్నారు.
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఎంపీ మహువామోయిత్రా డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. దీని కోసం విచారణ కోరుతూ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. ఇదే కాకుండా ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వ్యక్తులకు వెళ్లడించిందని, వారు దుబాయ్ నుంచి ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలో తాను తన స్నేహితుడు దర్శన్ హీరానందానీకి లాగిన్ వివరాలు ఇచ్చానని మోయిత్రా ఒప్పుకున్నారు. అయితే ప్రశ్నలు మాత్రం తానే అడిగానన్నారు. తాను లంచం తీసుకున్నా అనే వాదనల్ని ఖండించారు.
