NTV Telugu Site icon

Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాది హత్యకు కుట్ర.. వచ్చే వారం భారత్ రానున్న ఎఫ్‌బీఐ చీఫ్..

Fbi

Fbi

Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాది, భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రలో భారత ప్రమేయం ఉందని, ఆ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. అమెరికన్ పౌరుడైన పన్నూని హతమార్చేందుకు నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని నియమించుకున్నారని, అతనికి ఓ భారత ప్రభుత్వ ఉద్యోగితో సంబంధాలు ఉన్నాయని అమెరికా న్యాయశాఖ నేరాభియోగ పత్రంలో పేర్కొంది. అయితే అమెరికన్ పౌరుడిని, అమెరికన్ గడ్డపై హత్య చేయడానికి ప్లాన్ చేయడాన్ని బైడెన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సంఘటను భారత్ ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో లేవనెత్తామని అమెరికన్ అధికారులు చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే ఈ కుట్రలో భారత్‌తో సంబంధం ఉన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అమెరికా ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే వచ్చే వారం భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పర్యటన గురించి వెల్లడించారు.

Read Also: Congress: ముందైతే పీఓకే నుంచి ఒక యాపిల్ తీసుకురండి.. అమిత్ షా “నెహ్రూ” వ్యాఖ్యలపై అధిర్ రంజన్..

అమెరికా అత్యున్నత అధికారుల భారతదేశ సందర్శన గురించి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ… యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ భారతదేశానికి 4 సార్లు వచ్చారని, యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ మూడు సార్లు, యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ రెండుసార్లు భారత్‌కి వచ్చారని, ఎఫ్‌బీఐ డైరెక్టర్ వచ్చే వారం భారత్ వస్తున్నారని ఆయన చెప్పారు.

భారత సీనియర్ భద్రతాధికారుతో వ్రే చర్చలు జరుపుతారని తెలుస్తోంది. సిక్కు వేర్పాటువాద నేత, అమెరికన్-కెనడా ద్వంద్వం పౌరసత్వం కలిగిన గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్రకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై సీఐఏ చీఫ్ విలియం బర్న్స్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్‌లను బైడెన్ ప్రభుత్వం ఇండియాకు పంపినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. ఈ హత్యకు కుట్ర పన్నిన వారిని పట్టుకోవాలని భారత్‌కి సూచించినట్లు తెలిపింది.

US ప్రిన్సిపల్ డిప్యూటీ NSA జోనాథన్ ఫైనర్ ఈ వారం భారతదేశాన్ని సందర్శించారు, ఈ సందర్భంగా ఆయన విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, NSA అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మరియు డిప్యూటీ NSA విక్రాన్ మిస్రీలతో చర్చలు జరిపారు. ఈ కుట్రపై బాధ్యుల్ని పట్టుకోవాలని, వారిని జవాబుదారీగా చేయాలని భారత్‌కి చెప్పినట్లు వైట్‌హౌజ్ తెలిపింది.