Madhya Pradesh HC: ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇంటిని స్థానిక పరిపాలన అధికారులు తప్పుగా కూల్చేశారు. ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ విచారించి, సదరు మహిళకు రూ. 1 లక్షని పరిహారంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధి విధానాలు పాటించకుండా ఏ ఇంటినైనా కూల్చివేయడం స్థానిక సంస్థలకు ఇప్పుడు “ఫ్యాషన్”గా మారిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Amit Shah: అయోధ్య ప్రాణప్రతిష్ఠపై లోక్‌సభలో అమిత్ షా ఏమన్నారంటే..!
రాధా లాంగ్రీ అనే మహిళకు చెందిన ఇంటిని ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చేశారు. ఆమెకు రూ. లక్ష పరిహారం ఇస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. స్థానిక పరిపాలన, స్థానిక సంస్థలు సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ఏదైనా ఇంటిని కూల్చివేసి వార్తా పత్రికల్లో ప్రచురించడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది అని జస్టిన్ వివేక్ రుషియా ధర్మాసనం పేర్కొంది.
ఇంటి కూల్చివేత చివరి మార్గం కావాలని, క్రమబద్ధీకరించడానికి ఇంటి యజమానికి సరైన అవకాశం ఇవ్వాలని సూచించింది. అయితే, సరైన అనుమతి లేకుండా నిబంధనలు పాటించకుండా ఇల్లు నిర్మించుకునే హక్కు ఎవరికీ లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ ఆస్తికి సంబంధించి నకిలీ పత్రాలను తయారు చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అక్రమ ఆక్రమణలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అక్రమంగా నిర్మించిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చవేస్తున్నారు.
