instant loan apps mafia, Chinese Nationals Involved: రూ. 500 కోట్ల భారీ ఇన్‌స్టంట్ రుణాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు సుమారుగా రెండు నెలల విచారణ తరువాత భారీ స్కామ్ ను ఛేదించారు. తక్షణ రుణాలు ఇచ్చి.. విపరీతమైన వడ్డీలు కట్టాల్సిందిగా ఈ ముఠా సామాన్య ప్రజలను వేధిస్తోందని పోలీసులు వెల్లడించారు. చైనా నుంచి వచ్చే సూచనలతో ఈ ముఠా ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ భారీ స్కామ్ లో చైనా జాతీయుల ప్రమేయం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తేల్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నుంచి 22 మందిని అరెస్ట్ చేశారు. ఈ రుణాల స్కామ్ ద్వారా డబ్బును హవాలా, క్రిప్టో కరెన్సీల ద్వారా చైనా కు తరలిస్తున్నట్లు తేలింది.
అధిక వడ్డీలకు రుణాలు మంజూరు చేశారంటూ పలువురి నుంచి ఫిర్యాదులు అందాయని.. వడ్డీతో పాటు డబ్బులు పూర్తిగా చెల్లించినా.. మార్ఫింగ్ చేసిన వారి న్యూడ్ ఫోటోలను ఉపయోగించి ఈ ముఠా ఎక్కువ డబ్బులు వసూలు చేసేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసుల ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ ఈ ఫిర్యాదులన్నింటిని పరిగణలోకి తీసుకుంది. ఈ స్కామ్ లో దాదాపుగా 100 కన్నా యాప్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రుణాలు ఇచ్చే ముందు ప్రజల నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మెషన్ ను యాప్ లు కోరుతున్నాయని.. వారి కాంటాక్ట్స్, ఫోటోలు, చాటింగ్, మెసేజ్ వివరాలను యాక్సెస్ పొందిన తర్వాత రుణాలు ఇస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా చైనా, హాంకాంగ్ లోని సర్వర్లకు వినియోగదారుల సెన్సిటివ్ వివరాలను అప్ లోడ్ చేసేదని తేలింది.
Read Also: Actress Nakshathra: అర్థరాత్రి బస్సులో డ్రైవర్ నీచ పని.. ఆ నటి ఏం చేసిందంటే?
ఈ వివరాలు ఇచ్చిన తర్వాత నిమిషాల్లోనే బాధితుడి ఖాతాలో డబ్బులు జమయ్యేవని.. ఇలా రుణాలు తీసుకున్న తర్వాత ముఠా భయపెట్టడం ప్రారంభించేదని.. న్యూడ్ ఫోటోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తామని బెదిరించి ఎక్కువ డబ్బు వసూలు చేసేదని పోలీసులు వెల్లడించారు. ప్రజలు కూడా అవమానం భరించలేమనే ఉద్దేశ్యంతో వారు అడిగినంత ఇచ్చేవారని పోలీసులు వెల్లడించారు. రూ.5,000, రూ.10,000 రుణానికి బదులు రూ. లక్షల్లో చెల్లించాలని ఒత్తడి చేసేవారని దీంతో అనేక మంది ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఈ లోన్ యాప్ ముఠా అనేక ఖాతాలను ఉపయోగించేదని.. రోజుకు రూ. కోటి వరకు వీరి అకౌంట్లలోకి వచ్చేవని తెలుస్తోంది.
ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ నెట్ వర్క్ విస్తరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళలతో పాటు 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది చైనీయులను గుర్తించామని.. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల విచారణ తర్వాత ఈ ముఠా రికవరీ కాల్ సెంటర్లను పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లకు మార్చారని.. ఈ స్కామ్ లో ఇప్పటి వరకు రూ.500 కోట్లకు పైగా తరలించినట్లు పోలీసులు గుర్తించారు.