Bihar Exit Polls: దేశంలో రాజకీయంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. అందరి చూపు కూడా బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారే దానిపై నెలకొంది. బీహార్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం కూడా ఈ ఎన్నికల ఫలితాలపై అంచనాలు పెంచింది. బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశలుగా ఓటింగ్ నిర్వహించారు. తొలి విడతలో 65.08 శాతం నమోదు కాగా, రెండో విడతలో సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం ఓటింగ్ నమోదైంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ + జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి, ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘటబంధన్ కూటమికి మధ్య హోరా హోరు పోరు జరిగింది.
ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. 243 సీట్లు ఉన్న అసెంబ్లీలో 122 మ్యాజిక్ ఫిగర్.
* దైనిక్ భాస్కర్ ప్రకారం.. ఎన్డీయేకు 145-160, ప్రతిపక్ష మహాఘటబంధన్ కూటమికి 73-91 స్థానాలు వస్తాయని చెప్పింది. ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పింది. ఇతరులు 5-10 స్థానాలు గెలుస్తారని అంచనా వేసింది.
*మాట్రిజ్ ప్రకారం.. బీజేపీ ఎన్డీయే కూటమికి 147-167 సీట్లు వస్తాయని, ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘటబందన్ కూటమికి 70-90 సీట్లు వస్తాయని చెప్పింది.
*పీపుల్స్ ఇన్‌సైట్ ప్రకారం.. బీజేపీ కూటమికి 133-148 సీట్లు వస్తాయని, ప్రతిపక్ష ఆర్జేడీ కూటమికి 87-102 సీట్లు వస్తాయని , ఇతరులకు 3-6 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ప్రశాంత్ కిషోర్ పార్టీకి 0-2 స్థానాల వస్తాయని చెప్పింది.
* పీపుల్స్ పల్స్ ప్రకారం.. ఎన్డీయేకు 133-159 సీట్లు వస్తాయని , ఆర్జేడీ+కాంగ్రెస్ కూటమికి 75-101 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని వెల్లడించింది.
* జేవీసీ సర్వే ప్రకారం.. ఎన్డీయేకు 135-150 స్థానాలు వస్తాయని, మహాఘటబంధన్ కూటమికి 87-102 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
* పీ-మార్క్ ప్రకారం.. ఎన్డీయేకు 142-162 స్థానాలు కైవసం చేసుకుంటుందని, కాంగ్రెస్+ఆర్జేడీ కూటమి 80-98 స్థానాలకు పరిమితమవుతుందని, జన్ సురాజ్ కేవలం 1-4 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది.
* చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం.. ఎన్డీయే 130-138 సీట్లు సాధిస్తే, మహాఘటబంధన్ 100-108 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది.
అన్ని సర్వేలు కూడా ఎన్డీయే కూటమి సునాయాసంగా విజయం సాధిస్తుందని వెల్లడించింది. మ్యాజిగ్ ఫిగర్ దాటి మెరుగైనస స్థానంలో నిలుస్తుందని వెల్లడించాయి.