NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఏమైంది..? విదేశాల్లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు..?

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: రాహుల్ గాంధీ గత పదేళ్ల కాలంగా ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీకి, 2024లో ప్రతిపక్ష హోదా తీసుకువచ్చాడనే ఖ్యాతి కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం ఆయన లోక్‌సభలోప్రతిపక్ష నాయకుడిగా (LoP)ఉన్నారు. అయితే, ఆయన ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. నిజానికి భారత అంతర్గత విషయాలను ఎలాంటి రాజకీయ వైరం ఉన్నప్పటికీ విదేశీ గడ్డపై మాట్లాడటం అంత సబబు కాదు. కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన భేటీ అవుతున్న వ్యక్తులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఆయన అమెరికా పర్యటనలో సిక్కులపై, రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు దేశంలో అగ్గిరాజేశాయి. వీటిని హైలెట్ చేస్తూ బీజేపీ కాంగ్రెస్, రాహుల్‌పై విరుచుకుపడుతోంది. రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత పరువు తీస్తున్నాడని, భారత వ్యతిరేక శక్తులతో భేటీ అవుతున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. చివరకు ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖలిస్తానీ ఉగ్రవాది, భారత వ్యతిరేకి గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా సమర్థించడాన్ని భారత ప్రజలు మద్దతు ఇవ్వరు.

Read Also: Crime: పాత బాయ్ ఫ్రెండ్ తిరిగి రావడంతో.. కొత్త స్నేహితుడైన ఎస్సైని హత్య చేసిన మహిళా కానిస్టేబుల్..

సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలు:

సోమవారం వర్జీనియాలోని హెర్న్‌డాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్, భారత్‌లో మతస్వేచ్ఛ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ‘‘సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా లేదా దాని గురించి భారత్‌లో పోరాటం ఉంది. ఒక సిక్కు కారా ధరించడానికి గురుద్వారాకు వెళ్లడానికి అనుమతించబడుతాడా..? ఇది కేవలం సిక్కుల కోసమే కాదు అన్ని మతాల కోసం’’ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడు. ఈ వాఖ్యలు వివాదాస్పదమైంది.

నిజానికి సిక్కులు గర్వంగా దస్తర్(తలపాగా), కారా(ఉక్కు కంకణం) ధరించవచ్చు. భారత్‌లో ఎక్కడైన కిర్పాన్(మతపరమైన బాకు) ధరించవచ్చనేది వాస్తవం. నిజానికి చిన్నచిన్న కత్తులు కూడా మన విమానాల్లోకి అనుమతించరు. కానీ సిక్కుల పవిత్ర కిర్పాన్‌లను అనుమతిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు సిక్కు కమ్యూనిటీలో అగ్గిరాజేశాయి. సోనియాగాంధీ నివాసం ముందు సిక్కులు ఆందోళన నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 1984 లో సిక్కు మారణకాండ జరిగిందనే విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తూ, విమర్శలు గుప్పిస్తోంది.

ఇదిలా ఉంటే, ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని హైజాక్ చేస్తూ, భారత్‌లో సిక్కులు అణిచివేతకు గురవుతున్నారని అందుకే ‘ఖలిస్తాన్’ అనే దేశాన్ని కోరుకుంటున్నామని చెప్పాడు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘‘దేశాన్ని విభజించే కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలుస్తున్నాడు’’ అని విమర్శించారు.

Read Also: Gambling: జూదంలో భార్యని పణంగా పెట్టిన భర్త.. స్నేహితుల లైంగిక వేధింపులు..

రిజర్వేషన్లపై వ్యాఖ్యలు:

వాషింగ్టన్ DCలోని జార్జ్‌టౌన్ యూనివర్శిటీ విద్యార్థులు మరియు అధ్యాపకులతో సంభాషిస్తూ, కులగణన, రిజర్వేషన్ల గురించి వ్యాఖ్యానించాడు. కుల ఆధారిత రిజర్వేషన్ల కన్నా అట్టడుగు స్థాయిలోని వారిని బలోపేతం చేయడానికి మంచి మార్గాలు ఉన్నాయా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నప్పుడు రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తామని రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీ, మైనార్టీల జనాభా 90 శాతం ఉండగా.. దేశంలోని మొదటి 200 మంది వ్యాపారులు, అత్యున్నత న్యాయస్థానాలు, మీడియాలో వీరి భాగస్వామ్యం దాదాపు శూన్యమని రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రకటన చేసిన అమెరికాలో కూడా సమాన అవకాశాలు లేవనే విషయాన్ని గుర్తించాలి. అమెరికలో జాతి, ఆర్థిక విభజన ఉంటుంది.

భారత వ్యతిరేఖ నేతతో భేటీ:

దేశంలో రాజకీయాలు ఎలా ఉన్నా కూడా, బయటకు వెళ్లినప్పుడు దేశాన్ని వ్యతిరేకించే, దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలను చర్చించే వారికి, దాయాది దేశాలకు అనుకూలంగా ఉండే వారికి దూరంగా ఉండటం మంచిది. అయితే, రాహుల్ గాంధీ మాత్రం భారత్ అంటే నరనరాన ద్వేషం, హిందువులపై కోపం ప్రదర్శించడమే కాకుండా పాకిస్తాన్‌కి వంతపాడే అమెరికన్ చట్టసభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌ని కలవడంపై బీజేపీ విమర్శించింది.

ఈమె అమెరికన్ కాంగ్రెస్‌లో భారత వ్యతిరేక తీర్మానాలకు పెట్టింది పేరు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడమే కాకుండా, భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికన్ కాంగ్రెస్‌ని ఉద్దేశించి మాట్లాడటాన్ని కూడా వ్యతిరేకించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో పర్యటించింది. ఈమె పర్యటనను దగ్గరుండీ పాకిస్తాన్ స్పాన్సర్ చేసింది.

విదేశాల్లో ఇలా మాట్లాడొచ్చా..?

సొంతదేశం గురించి విదేశాల్లో విమర్శించడాన్ని నిషేధించే చట్టం ఏం లేదు. అయితే, ప్రతీ ఒక్కరికి ఒక కట్టుబాటు ఉంటుంది. విదేశాల్లో మన దేశాన్ని మనం కించపరచొద్దనే స్పృహ కలిగి ఉంటారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడి వంటి హోదాలో ఉన్న సమయంలో ఇది మరింత ఎక్కువగా ఉండాలి. గతంలో అటల్ బీహారీ వాజ్‌పేయ్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విదేశాల్లోకి వెళ్లిన సందర్భంలో ఎప్పుడూ కూడా దేశాన్ని కించపరిచేలా, అధికార పార్టీని కించపరిచేలా మాట్లాడలేదనే విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది.

Show comments