ESIC to expand: ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరిధి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 598 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ESICని 750 జిల్లాలకు విస్తరించనున్నట్లు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ESIC పథకం కింద ఇప్పుడు 3 కోట్ల 90 లక్షల కుటుంబాలు, 12 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. ESICని భవన నిర్మాణ రంగానికి కూడా విస్తరింపజేస్తామని పేర్కొన్నారు. తద్వారా ఆ కార్మికులు సైతం గౌరవప్రదమైన జీవితాన్ని గడపటానికి అవకాశం కలుగుతుందని అన్నారు.
పేరు మారిన ‘మేఘా గ్యాస్’
మేఘా గ్యాస్ కంపెనీ పేరు మారింది. ఈ సంస్థను ఇకపై మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త పేరుతో వ్యవహరించనున్నారు. మేఘా గ్యాస్ కంపెనీ.. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థకు అనుబంధంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని పలు నగరాల్లో ఈ సంస్థ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. రానున్న ఐదేళ్లలో పది వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.
also read: New Mandals in Telangana: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాలు.. తుది నోటిఫికేషన్ జారీ
అమరరాజాలో ‘మంగళ్’ విలీనం
అమరరాజా గ్రూప్ సంస్థ మంగళ్ ఇండస్ట్రీస్‌ను అమరరాజా బ్యాటరీస్ విలీనం చేసుకోనుంది. ఈ మేరకు అమరరాజా బ్యాటరీస్ బోర్డ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను మరియు మార్జిన్లను ఇంప్రూవ్ చేసుకోవటం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. మంగళ్‌యాన్ ఇండస్ట్రీస్‌కు చెందిన బ్యాటరీ ప్లాస్టిక్స్ కాంపోనెంట్ల బిజినెస్‌ను విలీనం చేసుకోనున్నారు. మంగళ్ ఇండస్ట్రీస్ ఇప్పటివరకు అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్‌కి మాత్రమే ప్లాస్టిక్ కంటైనర్లు, కవర్లు, స్పేర్ పార్ట్‌లు, హ్యాండిల్స్, జార్లు వంటివాటిని సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఇండియన్ స్టాక్ మార్కెట్లలో వరుస భారీ నష్టాలకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 362 పాయింట్లు పెరిగి 57507 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 129 పాయింట్లు జంపై 17146కి పైనే కొనసాగుతోంది. రూపాయి మారకం విలువ ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం 81.24 వద్ద ఉంది. మహింద్రా లాజిస్టిక్స్, స్టెర్‌లైట్ టెక్, అమరరాజా, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ స్టాక్స్ ఆశాజనకంగా ఉన్నాయి.