Engineering Student Gets 5 Years In Jail For “Celebrating” Pulwama Attack: 2019లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పుల్వామా దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి తర్వాత ఫేస్ బుక్ లో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి బెంగళూర్ స్పెషల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ. 25,000 జరిమానా విధించింది. ఈ మేరకు అదనపు సిటీ సివిల్, సెషన్స్ జడ్జి గంగాధర ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు ఫైజ్ రషీద్ కు ప్రస్తుతం 22 ఏళ్లు. నేరం జరిగే సమయానికి రషీద్ కు 19 ఏళ్లు. మూడున్నరేళ్లుగా ఇతడు కస్టడీలో ఉన్నాడు. సెక్షన్ 153ఏ( మతం ప్రాతిపదికన శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), సెక్షన్ 201 కింద అతన్ని కోర్టు దోషిగా నిర్థారించింది. సెక్షన్ 124(దేశ ద్రోహం) ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉండటంతో దీని విచారణ జరగలేదు.
Read Also: Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా.. సోషల్ మీడియాలో ఫోర్జరీ లేఖ
పుల్వామా దాడి జరిగిన తర్వాత రషీద్ సెలబ్రేట్ చేసుకుంటూ.. ఆర్మీని అవహేళన చేస్తూ ఫేస్ బుక్ లో పలు పోస్టులు చేశాడు. మత ప్రాతిపదికన ఇరు వర్గాల మధ్య అల్లర్లు జరిగే విధంగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిపై అవమానకరమైన పోస్టులు చేశాడు. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే విధంగా నిందితులు ప్రవర్తించినట్లు సాక్ష్యాలు లభించడంతో రషీద్ ను దోషిగా తేల్చింది కోర్టు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడినట్లు కోర్టు భావించింది.
నిందితులు కేవలం ఒకటి రెండు సార్లు కించపరిచే వాఖ్యలు చేయలేదని.. ఫేస్ బుక్ లోని అన్ని న్యూస్ ఛానెళ్లలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని.. అతడు నిరక్షరాస్యుడు, సామాన్యుడేం కానది.. ఇంజనీరింగ్ విద్యార్థి అని కోర్టు పేర్కొంది. అతడు 24 సార్ల కన్నా ఎక్కువ సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని కోర్టు తెలిపింది. సీఆర్పీఎఫ్ జవాన్ల మరణాన్ని భారతీయుడు కాకుంటేనే సెలబ్రేట్ చేసుకుంటాడని.. ఈ చర్య దేశానికి వ్యతిరేకంగా ఉందని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 2019లో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.