Site icon NTV Telugu

Jharkhand illegal mining case: సీఎం సన్నిహిత నేత ఇంట్లో ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం

Jharkhand

Jharkhand

Jharkhand illegal mining case: అక్రమ మైనింగ్ కేసులో మనీలాండరింగ్ నిబంధనల కింద జార్ఖండ్‌, బీహార్‌లతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో రెండు ఏకే-47 రైఫిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లోని అల్మారాలో వాటిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రేమ్ ప్రకాశ్‌కు సంబంధించి తమకు సమాచారం అందిందని, సీఎం హేమంత్ సోరెన్‌తో కూడా సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఈ దాడులు చేపట్టామని అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్‌పై ఈడీ విచారణ కొనసాగుతోంది.గతంలో కూడా ప్రేమ్ ప్రకాష్ నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అక్రమ ఆయుధాలపై ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేయనున్నారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రతినిధి పంకజ్‌ మిశ్రాను ప్రశ్నించడంతో తాజాగా దాడులు జరుగుతున్నాయి. ఈడీ జులై 19న మిశ్రాను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) 2002 కింద అరెస్టు చేసింది.

ప్రేమ్ ప్రకాశ్ ఇంటి ఆవరణతోపాటు మరో 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని అధికారులు చెప్పారు. జార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో దాడులు జరిపామని వివరించారు. ఆయుధాల గుర్తింపు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయనున్నామని, ఆయుధ చట్టాల ప్రేమ్ ప్రకాశ్‌పై ప్రత్యేక కేసు నమోదు చేసే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.

Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకే అవకాశం.. 1998 తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి ఛాన్స్

అలాగే, జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి గతంలో అరెస్టు చేసిన బచ్చు యాదవ్‌ను రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు ఈ నెల ప్రారంభంలో ఆరు రోజుల ఈడీ రిమాండ్‌కు పంపింది. బచ్చు పంకజ్ మిశ్రాకు సన్నిహితుడు. ఈ కేసులో మిశ్రాకు చెందిన 37 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.11.88 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న మొత్తం మిశ్రా, దాహూ యాదవ్, వారి సహచరులకు చెందినది. దీంతోపాటు ఇన్‌ల్యాండ్‌ వెస్సల్‌ ఎం.వి.ఇన్ఫ్రాలింక్‌-3ను కూడా అధికారులు సీజ్‌చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు రూ.36 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకొంది. ‘ఇప్పటి వరకు మేము స్వాధీనం చేసుకొన్న నగదు, బ్యాంక్‌ ఖాతాల్లోని సొమ్ము సాహిబ్‌గంజ్‌, సమీప అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ ద్వారా సంపాదించినట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్‌ నుంచి సంపాదించిన రూ.100 కోట్లు ఉన్న ప్రాంతం విషయం కూడా తెలిసింది. దానిని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని ఈడీ పేర్కొంది.

Exit mobile version