Wipro: ఐటీ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఆర్ధికమాంద్యం భయాలతో ఇప్పటికే మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇదిలా ఉంటే ఈ ప్రభావం భారత ఐటీ కంపెనీలపై కూడా పడుతోంది. దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో ఇటీవల ఫ్రెషర్ల జీతాలను తగ్గించాలని నిర్ణయించింది. రూ. 6.5 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగులకు జీతం తగ్గించి రూ. 3.5 లక్షలు ఆఫర్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై ఐటీ ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.
Read Also: S JaiShankar: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంపై జైశంకర్ ఏమన్నారంటే..?
తాజాగా ఈ విషయంపై ఐటీ ఉద్యోగ సంఘం NITES కేంద్ర కార్మిక మంత్రికి లేఖ రాసింది. ఆఫర్ లెటర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు టెక్ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు జీతం ఆఫర్లను తగ్గించే విప్రో నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. విప్రో తీసుకుంటున్న చర్యలు కార్మికుల దోపిడి, ఉద్యోగ భద్రతకు దారితీసే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొంది.
ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు NITES (నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్) లేఖ రాసింది. కంపెనీ జీతాలను అనైతికంగా తగ్గిస్తోందని, ఇది ఆఫర్ లెటర్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుందనని యూనియన్ అద్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలుజా అన్నారు. కంపెనీ నిర్ణయం వల్ల 4000 మంది ఉద్యోగులు ప్రభావితం అవుతున్నారని తెలిపారు. ఆఫర్ లెటర్ అనేది కంపెనీ, ఉద్యోగి మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే పత్రం అని.. ఇందులో మార్పులు ఉంటే రెండు పార్టీల సమ్మతితోనే జరగాలని ఉద్యోగసంఘం తెలిపింది.