Election Commission Wants Parties To Disclose Cost Of Revdi: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు కురిపించే హామీల వర్షం గురించి అందరికీ తెలిసిందే! తమని గెలిపిస్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, ఉచితంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఎన్నో హామీలు ఇస్తాయి. అయితే.. వాటిల్లో డొల్ల హామీలే ఎక్కువగా ఉంటాయి. అధికారంలోకి వచ్చాక, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో చాలా వాటిని లేపేస్తారు. ఇలాంటివి ఇప్పటికీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డొల్ల, ఉచిత హామీలపై చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలకు.. హామీల విషయంలో పూర్తి వివరణ ఇవ్వాలని లేఖ రాసింది.
ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలను నెరవేర్చేందుకు ఎంత డబ్బులు ఖర్చవుతాయి? ఆ నిధుల్ని ఎలా సర్దుబాటు చేస్తున్నారు? అనే వివరాలను వెల్లడించాలని ఎన్నికల సంఘం ఆ లేఖలో రాజకీయ పార్టీలను డిమాండ్ చేసింది. దీనిపై అక్టోబర్ 19వ తేదీలోగా తమ అభిప్రాయాల్ని వెల్లడించాలని సూచించింది. అధికారంలోకి వచ్చాక చేసే పనులపై ఇచ్చే హామీలు, మేనిఫెస్టోలు విడుదల చేయడమనేది.. రాజకీయ పార్టీల హక్కు అనే విషయాన్ని ఎన్నికల సంఘం అంగీకరిస్తోందని తెలిపింది. అంత మాత్రాన అమలుకు వీలుకాని హామీలు ఇవ్వడాన్ని మాత్రం ఉపేక్షించదని తేల్చి చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చుతారు? అందుకు ఆర్థిక వనరులు ఏంటి? దీనిపై కచ్ఛితమైన సమాచారం ఇవ్వాల్సిందేనని తెలిపింది.
ఇదే సమయంలో.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే.. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య సమాన పోటీ వాతావరణం ఉండాలని ఆ లేఖలో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే సమయంలో.. వాస్తవంగా అమలు చేయగలిగిన హామీలు, వాగ్దానాలనే విశ్వసించాలని ఓటర్లను సూచించింది.