రాష్ట్రపతి ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ ప్రారంభం రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29 చివరి తేదీ కాగా.. జూలై 18న ఓటింగ్, జూలై 21న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నిక ప్రక్రియ మొత్తం జూలై 24నాటికి పూర్తికానుంది.
ఇదిలా ఉంటే.. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీకి పోటీగా ప్రతిపక్షాల తరఫున దీటైన ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ఇవాళ ఢిల్లీలో కీలకభేటీ జరుగనుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దింపేందుకు ప్రతిపక్షాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పవార్ మాత్రం ఒప్పుకోవట్లేదు. మమత ఆధ్వరంలో జరిగే భాజపాయేతర పార్టీల సమావేశంలో ఉమ్మడి అభ్యర్థిగా నిలబడేందుకు పవార్‌ను ఒప్పిస్తారా? కొత్త పేరును తెరపైకి తేస్తారా?. ఈ సమావేశంలో ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ప్రముఖ పార్టీలకు చెందిన ప్రతినిధులందరూ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మరి విపక్షాలు ఏకతాటిపైకి వస్తాయా? ఉమ్మడి అభ్యర్థిని నిలిపి ఎన్నికల్లో వారిని గెలిపించే ప్రయత్నం చేస్తాయా? అనేది వేచి చూడాలి.
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ యత్నిస్తోంది. విపక్షాలతో మాట్లాడేందుకు హైకమాండ్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. విపక్ష నేతలతో మాట్లాడే బాధ్యతలు జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌కు అప్పగించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.