ఎల్‌నినోపై భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో అధికారికంగా ప్రారంభమైందని.. వర్షాకాలంలో మరింత బలపడనుందని వార్నింగ్ ఇచ్చింది. భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో (El Nino) పరిస్థితులు అధికారికంగా ప్రారంభమైనట్లు ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల కాలంలో ఈ ప్రభావం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.
ఐఎండీ విడుదల చేసిన ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) బులెటిన్ ప్రకారం.. మధ్య, తూర్పు పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినో స్థాయిని దాటాయని.. అంతేకాకుండా సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలకు వాతావరణ వ్యవస్థ కూడా స్పందించడం ప్రారంభించిందని పేర్కొంది. ‘‘ప్రస్తుతం భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాల కాలంలో ఇవి మరింత బలపడే అవకాశం ఉంది.’’ అని ఐఎండీ తన బులెటిన్‌లో వెల్లడించింది.
ఎల్‌నినోను అంచనా వేసే ప్రధాన సూచిక అయిన నినో 3.4 ఇండెక్స్ మూడు నెలల సగటు విలువ +0.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువకు చేరుకుంది. దీంతో అధికారికంగా ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినట్లు నిర్ధారణ అయింది. అదేవిధంగా పసిఫిక్ సముద్ర ఉపరితలం కింద కూడా విస్తృతంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ వేడి నీటి ప్రవాహాలు రాబోయే నెలల్లో పైకి రావడంతో ఎల్‌నినో ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం జూన్-ఆగస్టు కాలంలో మధ్య పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతల పెరుగుదల కొనసాగనుంది. జూలై నుంచి మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత విస్తరించవచ్చని అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితులు మాన్సూన్ సీజన్‌లో ఎక్కువ కాలం కొనసాగవచ్చని తెలిపింది.
నిరంతర పర్యవేక్షణ
పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తున్నామని, మాన్సూన్ కాలంలో ప్రతి నెలా తాజా అంచనాలను విడుదల చేస్తామని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఎల్‌నినో బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

