మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఐఫోన్‌ను బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో మిస్ అయింది. లండన్ నుంచి ముంబై వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి పోయి ఇంటికెళ్లిపోయారు. అనంతరం సమాచారం అందించడంతో దాదాపు గంటపాటు సిబ్బంది గాలించిన తర్వాత దొరికింది. అనంతరం ఫోన్‌ను షిండేకు అప్పగించినట్లు ‘జనసత్తా’ నివేదించింది.
లండన్‌లో వారం రోజుల పర్యటించారు. పర్యటన ముగించుకుని షిండే ప్రయాణిస్తున్న విమానం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటలకు ముంబైలో ల్యాండ్ అయింది. అనంతరం ఆయన తన నివాసానికి వెళ్లిపోయారు. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన ఐఫోన్ కనిపించడం లేదని గుర్తించారు. దీంతో వెంటనే ఆయన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్రిటిష్ ఎయిర్‌వేస్ భద్రతా సిబ్బందితో సమన్వయం చేసుకుని విమానంలో ఫోన్ కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఐఫోన్ విమానంలోనే ఉన్నట్లు గుర్తించారు. సుమారు గంటపాటు సాగిన గాలింపు అనంతరం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఫోన్‌ను షిండేకు తిరిగి అందించినట్లు సమాచారం.
సెప్టెంబర్ 5న సన్నిహితులతో కలిసి ఏక్‌నాథ్ షిండే లండన్ వెళ్లారు. దాదాపు వారం రోజుల పాటు బ్రిటన్‌లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆయనకు మూడు సత్కారాలు కూడా లభించినట్లు సమాచారం. లండన్ పర్యటనలో భాగంగా క్రికెటర్ విరాట్ కోహ్లీని కూడా షిండే కలిశారు. అలాగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గతంలో నివసించిన ఇంటిని సందర్శించి అక్కడి స్మారకాన్ని పరిశీలించారు. ఇక లండన్‌లో వడాపావ్ తింటున్న షిండే ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏక్‌నాథ్ షిండే తరచుగా వీడియో కాల్స్ కోసం ఐఫోన్‌ను ఉపయోగిస్తారని, సమావేశాల సమయంలో అప్పుడప్పుడు తన వ్యక్తిగత సహాయకుడికి ఫోన్‌ను ఇస్తుంటారని ‘జనసత్తా’ పేర్కొంది. గతంలోనూ ఆయన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్న ఘటన జరిగినట్లు నివేదిక తెలిపింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన ఓ ఫోన్‌ను పోగొట్టుకోగా, అనంతరం అది తిరిగి లభించినట్లు పేర్కొంది.

