Eknath Shinde: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే, తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమి ఎవరిని సీఎంగా ఎన్నుకన్నా శివసైనికులు వారికి మద్దతు ఇస్తారని షిండే స్పష్టం చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు.
‘‘నా వల్ల మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఏదైనా సమస్య ఎదురైతే మీ మనసులో ఎలాంటి సందేహం రాకుడదని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయం ఆమోదయోగ్యమేనని ప్రధానికి చెప్పాను మీరు మా కుటుంబానికి అధిపతి, మీ నిర్ణయాన్ని మేము కూడా అంగీకరిస్తాము. ప్రభుత్వ ఏర్పాటులో ఏ సమస్య లేదు’’ అని షిండే చెప్పారు.
‘‘నేను ఎల్లప్పుడు కార్యకర్తగానే పనిచేశాను, నేను ఎప్పుడూ సీఎం అవుతానని భావించలేదు. సీఎం అంటే కామన్ మ్యాన్. నేను దీనిని దృష్టిలో ఉంచుకుని పనిచేశాను. మనం ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల బాధల్ని చూశాను.’’ అని షిండే అన్నారు. మహాయుతి కూటమి గెలుపుకోసం కార్యకర్తల పనిచేశానని అన్నారు. అతిపెద్ద విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ప్రజలకు ఆయన థాంక్స్ చెప్పారు. ప్రజలు మహావికాస్ అఘాడీని తిరస్కరించారని వెల్లడించారు.
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని, సీఎం అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్లా అని షిండే చెప్పారు. మేము నిరాశ చెందలేదని, మేము నిరాశ చెందే వాళ్లం కామని, పోరాడే వాళ్లమని చెప్పారు. కలిసికట్టుగా మహాయుతి ఎన్నికల్లో పోరాడినట్లు చెప్పారు. తనకు ప్రధాని నరేంద్రమోడీ సంపూర్ణ మద్దతు ఉందన్నారు.
‘‘ గత 2-4 రోజులుగా మీరు ఎవరో దుమారం రేపుతున్నారనే పుకార్లు చూసి ఉంటారు. మేము విసుగు చెందే వ్యక్తులం కాదు. నేను ప్రధానితో మాట్లాడాను. మా వైపు నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరం చేదు. మీ నిర్ణయమే ఫైనల్. బీజేపీ నిర్ణయం ఫైనల్. పీఎం మోడీ, అమిత్ షా తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాం. ’’ షిండే అన్నారు.