Maharashtra New CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందు కోసం గట్టిగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ముఖ్యమంత్రి పోస్టుపై కన్నేసినట్టు చెప్పుకొస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు (సోమవారం) జరగనున్న మహాయుతి ఎమ్మెల్యేల భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే నూతన ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత శాసనసభ గడువు రేపటి (మంగళవారం)తో ముగియనుంది. కాబట్టి ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి అయింది.
Read Also: Huge Fire Accident: ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. పెద్దెత్తున మంటలు
ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మంగళవారం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే ఛాన్స్ ఉంది. మూడు పార్టీల అగ్రనేతలు ఆదివారం తమ ఎమ్మెల్యేలతో చర్చించారు. నూతన సీఎంను మహాయుతి నేతలతో కలిసి తమ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బావంకులే చెప్పుకొచ్చారు. ఇక, మరోవైపు.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు కుల సమీకరణాలు ప్రతికూలంగా మారే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే, మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానిదే అన్నింట్లో పైచేయి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన వారిలో ఏకంగా 13 మంది ఆ కులానికి చెందినవారే ఉన్నారు. అయితే, ఈసారి కూడా తమ సామాజిక వర్గానికే ముఖ్యమంత్రి పీఠం దక్కాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫడ్నవీస్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనను చాలా మంది గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. మరాఠా వ్యతిరేకిగా ఆయనకు ఉన్న ఇమేజీని వారు గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 30 శాతం ఉండగా.. బ్రాహ్మణులు కేవలం 10 శాతం ఉన్నారు.