PM Modi: రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు ఒక కులాన్ని మరో కులంపైకి కాంగ్రెస్ ఉసిగొల్పుతోందని ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీలను విభజించాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయని ఆయన అన్నారు. జార్ఖండ్‌లోని బొకారోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. “ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే” అనే నినాదాన్ని ఉపయోగించారు. ‘‘మనమంతా ఒకటిగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం’’ అని నినదించారు.
90వ దశకంలో ఓబీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించిన తర్వాత కాంగ్రెస్ ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికల్లో 250 సీట్లను దాటలేదని, కాబట్టి కాంగ్రెస్ ఓబీసీ కమ్యూనిటీని విచ్ఛిన్నం చేయాలని, అనేక కులాలను విభజించాలని కోరుకుంటోందని ప్రధాని ఆరోపించారు. ఓబీసీల ఐక్యత దేశాన్ని బలోపేతం చేసిందని అన్నారు. కాంగ్రెస్, జేఎంఎం పార్టీలు ఓబీసీలు తమలో తాము పోరాడాలని ప్లాన్ చేస్తున్నాయంటూ ఆరోపణలు చేవారు. ‘‘ఓబీసీ కమ్యూనిటీ విచ్ఛిన్నం కావాలని మీరు అనుకుంటున్నారా..? మీరు విడిపోతే మీ గొంతు బలహీనపడుతుంది. ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’’ అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
Read Also: Jammu Kashmir: విలేజ్ గార్డుల్ని చంపిన టెర్రరిస్టులు ట్రాప్.. కొనసాగుతున్న ఎన్‌కౌంటర్..
జార్ఖండ్‌కు చెందిన చాలా మంది యువకులు ఆర్మీలో ఉన్నారని ప్రధాని చెప్పారు. ‘‘జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 వల్ల మనం చాలా మంది జవాన్లను కోల్పోయాం. మోడీ ఈ గోడను బద్దలు కొట్టారు. కానీ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు ఇది ఇష్టం లేదు. దేశానికి స్వాతంత్య్రం, రాజ్యాంగం వచ్చిన ఏడు దశాబ్ధాల వరకు అంబేద్కర్ రాజ్యాంగం కాశ్మీర్‌లో అమలు కాలేదు. అక్కడి దళితులు, ఆదివాసీలకు రిజర్వేషన్లు లభించలేదు. ఆర్టికల్ 370 తొలిగిన తర్వాత, అక్కడ అంబేద్కర్ రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారు’’ అని మోడీ అన్నారు.
రాష్ట్రంలోనికి బంగ్లాదేశ్ చొరబాట్లను అడ్డుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. జార్ఖండ్ తన కుమార్తెలు, ప్రజల ఆధీనంలో ఉన్న భూమి భద్రత కోసం ఎన్డీయే ప్రభుత్వం అవసరమని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో అత్యంత సంపన్నమైన జార్ఖండ్‌ని మనం నిర్మించాలని, తాను జార్ఖండ్ ప్రజల సాయం, ఆశీర్వాదం కోసం వచ్చామని, బీజేపీని గెలిపించాలని ఆయన అన్నారు. జార్ఖండ్‌లో నవంబర్ 13 మరియు 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లు లెక్కించబడతాయి.