ED summons to Karnataka PCC chief DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) సమన్లు జారీ చేసింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ సమన్లు జారీ చేసిందని ఆయన కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు. తాను ఈడీకి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అయితే ఈడీ సమన్లు జారీ చేసిన సమయమే తప్పుగా ఉందని.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఇలా కేంద్రం చేస్తుందని అన్నారు. భారత్ జోడో యాత్రం, కర్ణాటక అసెంబ్లీ సెషన్ మధ్యలో ఈడీ హాజరుకావాాలని కోరిందని.. నా రాజ్యాంగ విధులు, రాజకీయ విధులు నిర్వర్తించే సమయంలో ఈ నోటీసులు వచ్చాయని ఆయన ట్వీట్ చేశారు.
నేను విచారణలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’కు హాజరుకాలేనని.. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ అని.. ఇదే బీజేపీకి కావాల్సింది అని ఆయన అన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రం కేరళలో సాగుతోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయిన ఈ యాత్ర 12 రాష్ట్రాల గుండా ఐదు నెలల పాలు 3570 కిలోమీటర్ల పాటు సాగుతూ.. కాశ్మీర్ లో ముగుస్తుంది. అయితే కేరళ తరువాత కర్ణాటక రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తుంది.
Read Also: Masood Azhar: పాకిస్తాన్‌కు ఆఫ్ఘనిస్తాన్ షాక్.. అటువంటి ఉగ్రవాదులు మీ దేశంలో ఉంటారని జవాబు
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద శివకుమార్‌పై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీలోని కర్ణాటక భవన్ లోని ఆయన సన్నిహితుడు, కాంగ్రెస్ నాయకుడైన హౌమంతయ్య, ఇతరులపై ఆదాయపు పన్ను శఆఖ అభియోగాలు మోపింది. ఈ కేసులో ఛార్జీషీట్ ఆధారంగా 2018 సెప్టెంబర్ నుంచి దర్యాప్తు ప్రారంభించింది. డీకే శివకుమార్ మనీలాండరింగ్ నేరానికి పాల్పడ్డాడని కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో భాగంగా గతంలో ఢిల్లీ, బెంగళూర్ వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. మొత్తం రూ. 429 కోట్లు లెక్కల్లో చూపని సంపద గుర్తించినట్లు అప్పట్లో ఐటీ పేర్కొంది. 2017లో పెట్టుబడులు పెట్టేందుకు శివకుమార్ కుమార్తె సింగపూర్ వెళ్లారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కేసులో భాగంగా 2017లో ఐటీ శాఖ డీకే శివకుమార్ కు సంబంధించిన ఫ్లాట్లలో సోదాలు నిర్వహించగా.. రూ. 8.5 కోట్లు దొరికాయి. ఈ కేసులో 2019 సెప్టెంబర్ లో డీకే శివకుమార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా మరోసారి ఈడీ విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.