ED Raids: కేరళం రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు..

  • మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు..
  • ​సీఎంఆర్ఎల్ మనీలాండరింగ్ కేసులో రంగంలోకి దిగిన ఈడీ..
  • ​తిరువనంతపురంలోని విజయన్ అద్దె ఇల్లే లక్ష్యంగా తనిఖీలు ..
  • ​కేరళం వ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు
Ed Raids Former Kerala Cm P

Ed Raids Former Kerala Cm P

ED Raids: కేరళం రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు ప్రారంభించారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. కేరళం రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో పినరయి విజయన్ నివాసం ఉంటున్న అద్దె ఇల్లు సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో దాడులు చేపట్టాయి. విజయన్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర ముఖ్యుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ​ఈ దాడులన్నీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఉన్న నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. సీఎంఆర్ఎల్ వ్యవహారంలో జరిగిన ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపుపై పూర్తిస్థాయి ఆధారాలు సేకరించేందుకే ఈ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ​మాజీ ముఖ్యమంత్రి నివాసంపైనే నేరుగా ఈడీ దాడులు జరగడంతో కేరళం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సోదాలపై రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.

ఈ పరిణామం కేరళం రాజకీయాల్లో సంచలనంగా మారింది.. సీఎంఆర్ఎల్-ఎక్సాలోజిక్ నెలసరి చెల్లింపుల కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణల దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ఈడీ బృందాలు తిరువనంతపురంలోని పినరయి విజయన్ అద్దె నివాసానికి చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. ఇదే ఇంట్లో ఆయన కుమార్తె వీణా విజయన్ కూడా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. వీణా విజయన్‌కు చెందిన ఐటీ సంస్థ ‘ఎక్సాలోజిక్ సొల్యూషన్స్’ ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే వీణా విజయన్‌ను ఈడీ అధికారులు విచారించినట్లు సమాచారం. అయితే పినరయి విజయన్‌ను ఇప్పటివరకు ప్రశ్నించకపోయినా, దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేరళం హైకోర్టు ఇటీవల ఈడీ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సోదాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సీఎంఆర్ఎల్ సంస్థ నుంచి ఎక్సాలోజిక్ సంస్థకు ఎలాంటి సేవలు అందించకుండా భారీ మొత్తంలో నెలసరి చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. తిరువనంతపురం సహా కేరళం వ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఎంఆర్ఎల్ కార్యాలయాలు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ కర్తకు సంబంధించిన ప్రాంగణాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ట్రాన్సాక్షన్ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే బేపూర్ నియోజకవర్గ సీపీఎం ఎమ్మెల్యే పీఏ మహమ్మద్ రియాస్ నివాసంలో కూడా ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఆయన వీణా విజయన్ భర్త కావడం గమనార్హం. ఇక ఈ కేసులో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO), ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను గుర్తించినట్లు సమాచారం. “మంత్లీ రిటైనర్స్” పేరుతో చెల్లింపులు జరిగినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ సోదాలపై లెఫ్ట్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ కక్షసాధింపులో భాగమని లెఫ్ట్ ఫ్రంట్ ఆరోపిస్తోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి స్థాయి నేత నివాసంపైనే ఈడీ దాడులు జరగడం కేరళం రాజకీయాల్లో భారీ చర్చకు దారితీసింది.