NTV Telugu Site icon

Sanjay Raut: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: ముంబైలోని పత్రాచాల్ భూకుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం ఆయన నివాసంలో గంటల కొద్దీ దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు కూడా రౌత్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించింది. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో పాటు ఈడీ బృందం రౌత్ నివాసానికి చేరుకుంది. రూ.1,034 కోట్ల పత్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నోటీసులు అందుకున్న ఆయన.. విచారణకు హాజరుకాలేదు. జులై 27న ఈడీ ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో హాజరు కాలేనని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు ఆయన ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది.

పత్రాచాల్‌ భూకుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలపై సంజయ్‌ రౌత్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలదేన్నారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను. బాలాసాహెబ్‌ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా’’ అని ట్వీట్‌ చేశారు.

మరోవైపు రౌత్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ తప్పూ చేయకపోతే.. ఈడీ విచారణకు రౌత్‌ ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే రామ్‌ కడం ప్రశ్నించారు. విలేకరుల సమావేశం నిర్వహించడానికి సమయం ఉన్నప్పుడు ఈడీ ముందుకు వెళ్లడానికి ఎందుకు లేదని నిలదీశారు. సంజయ్ రౌత్‌ను జులై 1న ఈడీ అధికారులు దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించారు. తర్వాత మరో రెండు సార్లు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన హాజరు కాలేదు.

Regional Parties: దేశంలోని 54 ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో నంబర్-1గా జేడీయూ

ఏప్రిల్‌లో, ఈ దర్యాప్తులో భాగంగా రౌత్ భార్య వర్షా రౌత్, అతని ఇద్దరు సహచరులకు చెందిన రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తులు పాల్ఘర్, సఫాలే (పాల్ఘర్‌లోని పట్టణం), పద్ఘా (థానే జిల్లాలో) వద్ద సంజయ్ రౌత్ సహాయకుడు, గురు ఆశిష్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అయిన ప్రవీణ్ ఎం రౌత్ ఆధీనంలో ఉన్న భూమి రూపంలో ఉన్నాయి. ముంబయి శివారులోని దాదర్‌లోని వర్షా రౌత్‌కు చెందిన ఫ్లాట్‌తోపాటు అలీబాగ్‌లోని కిహిమ్ బీచ్‌లో వర్షా రౌత్, సుజిత్ పాట్కర్ భార్య స్వప్నా పాట్కర్ సంయుక్తంగా కలిగి ఉన్న ఎనిమిది ప్లాట్లు కూడా అటాచ్ చేసిన ఆస్తుల్లో ఉన్నాయని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.1,034 కోట్ల పత్రాచాల్‌ భూకుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే రౌత్‌ సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.