Site icon NTV Telugu

Satyender Jain: మంత్రి సత్యేంద్ర జైన్‌ ఇంట్లో ఈడీ సోదాలు ..

Satyendra

Satyendra

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గతనెల 30న మనీలాండరింగ్‌ కేసులో సత్యేంద్రను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఇవాళ (సోమవారం) తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు.

కోల్ కత్తాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ కేసులో సత్యేంద్ర జైన్, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన 4.81కోట్ల విలువైన స్థిరాస్థులను ఈడీ గత ఏప్రిల్‌లోనే జప్తు చేసింది. సత్యేంద్రజైన్ పై 2017లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. జూన్‌ 9 వరకు సత్యేంద్ర ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

కాగా.. ఆప్ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొన‌సాగుతున్న స‌త్యేంద్ర జైన్‌ ఢిల్లీలోని షాకూర్ బ‌స్తీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అర‌వింద్ కేజ్రీవాల్ కేబినెట్‌లోని ఏడుగురు మంత్రుల్లో ఒక‌రిగా స‌త్యేంద్ర జైన్ కొన‌సాగుతున్నారు. ఆరోగ్య శాఖ‌తో పాటు ప‌రిశ్ర‌మ‌లు, ప‌ట్టణాభివృద్ధి, విద్యుత్, హోం శాఖల మంత్రిగా స‌త్యేంద్ర జైన్ కొన‌సాగుతున్నారు.

అయితే.. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ విషయంలో ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమ మంత్రిపై అక్రమంగా కేసు మోపారని, రాజకీయ కారణాలతో ఆయనపై కేసు పెట్టారని అన్నారు. తమ పార్టీ, ప్రభుత్వాలు నిజాయితీకి కట్టుబడి ఉన్నాయని, అవినీతిని సహించమన్నారు. ఈ కేసులో మంత్రి సత్యేంద్ర జైన్ పై వచ్చిన ఆరోపణల్లో ఒక్క శాతమైన నిజమున్నట్లు తేలినా తానే స్వయంగా ఆయనపై చర్యలు తీసుకునేవాడినని చెప్పిన విష‌యం తెలిసిందే..

Noro Virus: కేర‌ళ‌లో చిన్నారుల‌కు సోకిన కొత్త వైర‌స్‌.. చికిత్స చేయ‌క‌పోతే..

Exit mobile version