Site icon NTV Telugu

National Herald Case: వాయిదా వేయమన్న రాహుల్ గాంధీ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈడీ

Rahul Gandhi Ed

Rahul Gandhi Ed

‘నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్’ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గత మూడు రోజులు వరుసగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రశ్నించిన సంగతి తెలిసిందే! మొత్తం 28 గంటల పాటు జరిపిన విచారణలో అధికారులు రాహుల్‌కి ఎన్నో ప్రశ్నలు సంధించారు. ఈరోజు (గురువారం) మాత్రం విచారణ నుంచి రాహుల్ గాంధీకి విరామం ఇచ్చారు. అయితే.. శుక్రవారం నాడు విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనంటూ ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది.

రాహుల్ గాంధీ మాత్రం ఈ విచారణను సోమవారానికి వాయిదా వేయాల్సిందిగా ఈడీని విజ్ఞప్తి చేశారు. తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమె ఆసుపత్రిలో ఉందని తెలిపారు. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని కలిసేందుకు వెళ్లాలని రాహుల్ విజ్ఞప్తి చేసినందుకే, గురువారం విచారణను నిలిపివేశారు. అతని విజ్ఞప్తి మేరకు విచారణకు బ్రేక్ ఇవ్వడంతో.. తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ తల్లి సోనియా గాంధీ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తల్లి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈడీ అతని విజ్ఞప్తిని అంగీకరిస్తూ, సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.

ఇదిలావుండగా.. తమ అగ్రనేత రాహుల్ గాంధీని మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నిస్తుండడం పట్ల కాంగ్రెస్ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపడుతున్నాయి. ఇక ఖైరతాబాద్ అయితే రణరంగంగా మారింది. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకోవడం, వారిని అడ్డుకునేందుకు పోలీసుల్ని మోహరించడంతో.. ఉత్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బైక్‌కి నిప్పంటించడంతో పాటు బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version