E20 Petrol New Controversy: E20 పెట్రోల్‌పై మరో వివాదం.. ఏకంగా 31.2 శాతం ఇథనాల్‌! ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు

E20petrol

E20petrol

E20 Petrol New Controversy: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌పై చర్చ కొనసాగుతున్న వేళ.. తాజా వ్యవహారం దూమారమే రేపుతోంది.. ఈ20 పెట్రోల్‌పై కర్ణాటక ప్రభుత్వం సంచలన విషయాలను వెల్లడించింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాల్సి ఉండగా, కొన్ని చమురు కంపెనీలు నిర్దేశిత పరిమితికి మించి ఇథనాల్ కలుపుతున్నట్లు ఆరోపించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సేకరించిన పెట్రోల్ నమూనాలను ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షించగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు ప్రకటించింది. కొన్ని నమూనాల్లో ఇథనాల్ శాతం ఏకంగా 31.2 శాతానికి చేరినట్లు తెలిపింది.

63 పెట్రోల్ నమూనాల సేకరణ
కర్ణాటక ప్రభుత్వం ఇండియన్ ఆయిల్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), భారత్ పెట్రోలియం (BPCL), నయారా, షెల్ వంటి సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల నుంచి మొత్తం 63 నమూనాలను సేకరించింది. మొదట ఈ నమూనాలను ఆయా చమురు కంపెనీల ల్యాబ్‌లకు పంపించి, వాటిలో ఇథనాల్ పరిమాణం ఎంత ఉందో వెల్లడించాలని కోరింది. అయితే కంపెనీల నుంచి స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతో కొన్ని నమూనాలను ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపి పరీక్షలు నిర్వహించింది. ఏడు జిల్లాల నుంచి సేకరించిన నమూనాల్లో నిర్దేశిత 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ఏ కంపెనీ పెట్రోల్‌లో ఎంత ఇథనాల్ ఉందంటే?
కర్ణాటక ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ నమూనాల్లో అత్యధికంగా 31.2 శాతం ఇథనాల్ ఉన్నట్లు తేలింది. హిందుస్థాన్ పెట్రోలియం నమూనాల్లో 30.5 శాతం, భారత్ పెట్రోలియంలో 26.5 శాతం, నయారా పెట్రోల్‌లో 26.1 శాతం, షెల్ పెట్రోల్‌లో 25.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు వెల్లడించింది. అయితే, పెట్రోల్‌లో నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువగా ఇథనాల్ కలపడం వల్ల వాహనదారులపై అదనపు భారం పడుతుందని కర్ణాటక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు ఇంజిన్ పనితీరు, నిర్వహణ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇంధన మైలేజీ 10 శాతం తగ్గినా దేశవ్యాప్తంగా ఏటా సుమారు రూ.62,000 కోట్ల నష్టం వాటిల్లవచ్చని అంచనా వేసింది. వాహనాల సర్వీసింగ్, నిర్వహణ ఖర్చుల రూపంలో మరో రూ.39,000 కోట్ల మేర భారం పడుతోందని ప్రభుత్వం పేర్కొంది.

కేంద్రం జోక్యం చేసుకోవాలి.. నష్టపరిహారం చెల్లించాలి!
ఈ వ్యవహారంపై కర్ణాటక మంత్రి రిజ్వాన్ అర్షద్ కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవాలని కోరారు. నిర్దేశిత పరిమితికి మించి ఇథనాల్ కలిగిన పెట్రోల్‌ను ఉపయోగించడం వల్ల నష్టపోయే వాహన యజమానులకు పరిహారం అందించేలా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇథనాల్ శాతం అధికంగా ఉన్న పెట్రోల్ కారణంగా వాహనదారులకు కలిగే ఆర్థిక నష్టాలను భర్తీ చేసే బాధ్యతను కేంద్రం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా E20 పెట్రోల్‌లో ఇథనాల్ పరిమాణంపై కర్ణాటక ప్రభుత్వం వెల్లడించిన వివరాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, సంబంధిత చమురు కంపెనీలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, ఇప్పటికే E20 పెట్రోల్‌పై ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు రాగా.. వాటిని కేంద్రం తోసిపుచ్చుతూ వస్తున్న విషయం విదితమే..