Crown Prince of Dubai: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ ఏప్రిల్ 8-9 తేదీల్లో భారత్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) సోమవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ వస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం చేయడానికి పలు సమావేశాల్లో పాల్గొననున్నారు.
Read Also: Aqua: ట్రంప్ నిర్ణయంతో ఆక్వా రంగం కుదేలు.. కేంద్రానికి చంద్రబాబు లేఖ..
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హోదాలో ఆయన భారత్‌లో చేసే మొదటి అధికార పర్యటన అవుతుంది. షేక్ హమ్దాన్‌తో పాటు అనేక మంది మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి బృందం కూడా వస్తున్నట్లు MEA తెలిపింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రిగా బాధ్యలు నిర్వహిస్తున్నారు.
‘‘యూఏఈ భారత్ వాణిజ్య, సాంస్కృతిక సంబందాల్లో దుబాయ్ ముఖ్యపాత్ర పోషించింది. యూఏఈలో దాదాపుగా 43 లక్షల మంది భారతీయులలో మెజారిటీ మంది దుబాయ్‌లోనే నివసిస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ సందర్శన భారత్-యూఏఈ సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో పర్యటించిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ప్రధాని మోడీ ఆహ్వానాన్ని క్రౌన్ ప్రిన్స్‌కి అందించారు.