ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర సృష్టించారు.. కనీసం కరెంటు కూడా లేని కుగ్రామంలో పుట్టిన ఆమె.. ఇప్పుడు దేశ అత్యున్నత పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అసలు ద్రౌపది నేపథ్యం ఏంటి? ఎక్కడ పుట్టారు? రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అనే అంశాలపై ఓ లుక్ వేస్తే.. దేశానికి స్వాతంత్యం వచ్చిన 11 సంవత్సరాల తరువాత అంటే 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలోని బైదాపోసి గ్రామంలో ద్రౌపది ముర్ము జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. ఆయన సంతాల్ ఆదివాసి తెగకు చెందినవారు. ఈ తెగ వందల ఏళ్లుగా మనదేశంలో ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. అంతేకాదు.. సంతాల్ తెగ వీరులను దేశ మొదటి స్వాతంత్య పోరాట యోధులుగా కూడా పిలుస్తారు. అలాంటి తెగ నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము ఇప్పుడు దేశ రాష్ట్రపతి అయ్యారు.
ద్రౌపది ముర్ము, 1979లో భువనేశ్వర్‌లోని రమాదేవి ఉమెన్స్ కాలేజీ నుంచి బీఏ పాస్ అయిన తరువాత, ఒడిశా ప్రభుత్వోద్యోగిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. నీటిపారుదల, ఇంధన శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. తరువాతి కాలంలో తనకున్న ఆసక్తితో టీచర్ అయ్యారు. రాయంగ్‌పూర్‌లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో గౌరవ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. కష్టపడి పనిచేసే ఉద్యోగిగా గుర్తింపు పొందారు. ముర్ము 1997లో వార్డు కౌన్సెలర్‌గా తన పొలిటికల్ కేరీర్ ప్రారంభించారు. రాయిరంగపూర్ నగర పంచాయతీ ఎన్నికలలో వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. నగర పంచాయతీ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు.తరువాత, రాయరంగ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు 2000, 2009లలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి సారి ఎమ్మెల్యే అయిన తరువాత, 2000 నుంచి 2004 వరకు నవీన్ పట్నాయక్ సంకీర్ణ ప్రభుత్వం హయంలో మంత్రిగా వ్యవహరించారు. వాణిజ్యం, రవాణా, మత్స్య శాఖలతో పాటు జంతు వనరుల శాఖలను నిర్వహించారు.
మంత్రిగా ఉండి కూడా ఆమె నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఆమెకు సొంత వాహనం కూడా లేదు. ఒడిశాలోని ఉత్తమ ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును ఆమె అందుకున్నారు. రెండుసార్లు బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరించారు. 2002 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2015 ఏప్రిల్ వరకు ఈ మోర్చా జాతీయ కార్యవర్గంలో సభ్యురాలిగా ఉన్నారు. దీని తర్వాత ఆమెను జార్ఖండ్ గవర్నర్‌గా నామినేట్ చేశారు. ఆ తరువాత క్రమంగా బీజేపీ క్రియాశీల రాజకీయాల నుంచి దూరమయ్యారు. 2015 మే 18న ద్రౌపది ముర్ము ఝార్ఖండ్‌కు తొలి మహిళ, గిరిజన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు సంవత్సరాలకు పైబడి నెలా 18 రోజుల పాటు ఈ పదవిలో కొనసాగారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నికైన మొదటి గవర్నర్ ఆమె. అయిదేళ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత కూడా గవర్నర్‌గా కొనసాగారు. తన పదవీ కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నాక కూడా వివాదరహితురాలిగానే ముర్ము కొనసాగారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా ముందుకు కదిలారు. గతంలో ఆమె బీజేపీ నేతగా ఉన్నా.. జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నప్పుడు బీజేపీ సర్కారు తెచ్చిన బిల్లుల్లో కొన్నింటిని వెనక్కి పంపారు. ఆదివాసీల భూములను కాపాడేందుకు బ్రిటిష్ పాలనలో తీసుకొచ్చిన చోటానాగ్ పూర్ కౌలుదారీ చట్టం, సంతాల్ పరగణా కౌలు చట్టంలోని కొన్ని నిబంధనలను సవరించాలని 2017లో అప్పటి రఘువర్ దాస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించినా.. అసెంబ్లీలో ఆవెూదం పొందింది. అయితే ఆవెూదం కోసం రాజ్ భవన్ కు ఫైలు వెళ్లిన తర్వాత గవర్నర్ గా ఉన్న ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై సంతకం చేయకుండా వెనక్కు పంపారు. దీనివల్ల ఆదివాసీలకు ఏం లాభమని ప్రశ్నించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన జవాబు చెప్పలేకపోయింది. దాంతో ఆ బిల్లు ముందుకు సాగలేదు. దీనిపై విమర్శలు వచ్చినా ముర్ము వెనక్కి తగ్గలేదు.
తన పదవీ కాలంలో పాఠశాలల, కాలేజీల పరిస్థితులను సమీక్షిస్తూ వాటి మెరుగుదలకు కృషి చేశారు. 2016లో యూనివర్సిటీల కోసం లోక్ అదాలత్ నిర్వహించారు. వ్యతిరేకత వచ్చినప్పటికీ ఛాన్సలర్ పోర్టల్‌ను ప్రారంభించారు. యూనివర్సిటీలకు సంబంధించిన అన్ని ప్రక్రియలను ఆన్‌లైన్ చేసే మార్గమిది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌లతో చర్చిస్తూ, గిరిజన భాషల అధ్యయనానికి సంబంధించిన సూచనలెన్నో చేశారు. ఫలితంగా, యూనివర్సిటీల్లో చాలా కాలంగా మూతపడిన గిరిజన, ప్రాంతీయ భాషల ఉపాధ్యాయుల నియామకం మళ్లీ మొదలైంది. ద్రౌపది ముర్ము గవర్నర్‌గా ఉండగానే రాజ్‌భవన్‌లో అన్ని మతాలవారికి ఎంట్రీ ఇచ్చారు. రాజ్‌భవన్‌లో హిందూ, ముస్లింలు, సిక్కు, క్రైస్తవులందరికీ సమాన గౌరవం కల్పించారు.