NTV Telugu Site icon

Dog Meat Row: బెంగళూర్ హోటళ్లకు కుక్క మాంసం.. ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు..

Dog Meat Row

Dog Meat Row

Dog Meat Row: బెంగళూర్‌లోని పలు రెస్టారెంట్, హోటళ్లకు మటన్ బదులుగా కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శుక్రవారం రాత్రి రైల్వే స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న మాంసాన్ని విశ్లేషించేందుకు ఫుడ్ లేబోరేటరీకి పంపారు. ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని శనివారం ప్రభుత్వం ప్రకటించింది.

Read Also: Indian Student: 10ఏళ్లు..విదేశాల్లో 633 మంది భారతీయ విద్యార్థుల మృతి..అత్యధికంగా ఇక్కడే..

రాజస్థాన్‌ నుంచి బెంగళూరులోని హోటళ్లకు కుక్క మాంసం సరఫరా చేస్తున్నారని శుక్రవారం సాయంత్రం కొన్ని సంఘాలు ఆరోపిస్తూ నిరసన తెలిపాయి. రైలు మార్గం ద్వారా బెంగళూర్‌కి మటన్, ఇతర మాంసం సరఫరా అవుతోందని శుక్రవారం సమాచారం అందిందని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎ) కమిషనరేట్ తెలిపింది. కర్ణాటక ఎఫ్ఎస్ఎస్ఏ పోలీస్ టీం, ఇతర అధికారులు రైల్వే స్టేషన్‌‌లో తనిఖీ కోసం వెళ్లారు. రాజస్థాన్ నుంచి బెంగళూర్‌కి వచ్చిన పార్సిళ్లలో మాంసాన్ని గుర్తించారు. మొత్తం 90 ప్యాకెట్లు ఉండగా, వాటిలో జంతువుల మాంసాన్ని గుర్తించారు.

ఈ మాంసం ఏ జంతువుకు చెందినదనే విషయాన్ని తెలుసుకునేందుకు నమూనాలను ఆహార ప్రయోగశాలకు పంపారు. రాజస్థాన్‌ నుంచి బెంగుళూరుకు మటన్‌తో పాటు కుక్కమాంసాన్ని విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ హిందూత్వ కార్యకర్త పునీత్‌ కెరెహళ్లి తదితరులు శుక్రవారం బెంగళూరులోని మెజెస్టిక్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో నిరసన తెలిపారు. బెంగళూరులోని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లకు ఈ మాంసాన్ని సరఫరా చేసేందుకు ఉద్దేశించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.