Mallikarjun kharge: కన్యాకుమారిలో ప్రధాని నరేంద్రమోడీ ‘‘ధ్యానం’’పై కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ప్రధానిపై విమర్శలు చేశారు. రాజకీయాలను, మతాన్ని ఎప్పటికీ కలపకూడదని, దేవుడిపై విశ్వాసం ఉంటే ఇంట్లోనే ధ్యానం చేసుకోండి అంటూ మండిపడ్డారు. ‘‘రాజకీయాలను మతాన్ని ఎప్పుడు కలిపి చూడకూడదని, ఒక మతానికి చెందిన వ్యక్తి మీతో ఉండొచ్చు. మరొక మతానికి చెందిన వ్యక్తి మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఎన్నికల్లో మతపరమైన భావాలను ముడిపెట్టడం సరికాదు’’ అని ఖర్గే అన్నారు.
Read Also: Loksabha Elections 2024: రేపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ సమయంలోనే..
లోక్‌సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో విడతకు జూన్ 1న ఎన్నికలకు జరగనున్నాయి. అయితే, దీనికి 3 రోజుల ముందు ప్రధాని ఆధ్యాత్మిక విహారం కోసం కన్యాకుమారి చేరుకున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలో ప్రధాని నరేంద్రమోడీ 48 గంటల పాటు జూన్ 1 సాయంత్రం వరకు ధ్యానాన్ని కొనసాగించనున్నారు. అయితే, అతను కన్యాకుమారి వెళ్లి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని ఖర్గే అన్నారు. ఇంత మంది పోలీసులను నియమించడం ద్వారా డబ్బుని వృథా చేస్తున్నారని, ఈ చర్య దేశానికి హాని కలిగిస్తుందని అన్నారు. మీకు దేవుడిపై నమ్మకం ఉంటే ఇంట్లో ధ్యానం చేసుకోవాలని సూచించారు.
శనివారం చివరిదైన ఏడో దశ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ పోటీ చేస్తున్న వారణాసితో పాటు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
