DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ

Mkstalin

Mkstalin

DMK MPs Meeting: డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయడంతో.. మరోసారి ఈ వ్యవహారంపై రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.. దక్షిణాది పార్టీలు సూచించిన కొన్ని మార్పులు కూడా చేసేందుకు నరేంద్ర మోడీ సర్కార్‌ సిద్ధమైన నేపథ్యంలో.. ఆ పార్టీల వ్యూహం ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది.. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు డీఎంకే సిద్ధమైంది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు చెన్నైలోని అన్నా అరివాలయంలో జరిగే ఈ భేటీకి డీఎంకే ఎంపీలు హాజరుకానున్నారు.

నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ప్రధాన చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరి, బిల్లును ఎదుర్కొనే వ్యూహంపై స్టాలిన్ ఎంపీలతో చర్చించనున్నారు. ముఖ్యంగా తమిళనాడుకు లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలన్నది డీఎంకే ప్రధాన డిమాండ్‌గా ఉంది. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రాలకు ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని స్టాలిన్ పట్టుబడుతున్నారు. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ కారణంగా అన్యాయం జరగకూడదన్నది డీఎంకే వాదనగా ఉంది.

మరోవైపు, డీలిమిటేషన్‌కు సంబంధించి కొత్త బిల్లులో తమ డిమాండ్లకు తగిన రక్షణ ఉందా లేదా అనే అంశాన్ని డీఎంకే పరిశీలించనుంది. బిల్లులోని ప్రతిపాదనలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే కేంద్రానికి మద్దతు ఇవ్వాలా? వ్యతిరేకించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ దిశగా కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఆమోదించిన నేపథ్యంలో రాజకీయంగా ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే ఎలాంటి వైఖరి తీసుకోనుంది? పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో స్టాలిన్ వ్యూహం ఎలా ఉండబోతోంది? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. నేటి ఎంపీల సమావేశం తర్వాత డీఎంకే వైఖరిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.