INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్‌కాట్..

  • ఇండియా కూటమికి డీఎంకే షాక్..
  • కీలక సమావేశం బాయ్‌కాట్..
  • కాంగ్రెస్ మిత్రద్రోహంపై ఆగ్రహమే కారణమా..?
India Alliance

India Alliance

ఇండియా కూటమి కీలక సమావేశం ఈ నెల 8న జరుగనుంది. కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), డీఎంకేలు ఇటీవల జరిగిన బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ సమావేశం జరుగుతుండటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, జూన్ 8న నిర్వహించబోతున్న ఈ సమావేశాన్ని డీఎంకే బాయ్‌కాట్ చేసింది. సమావేశానికి హాజరుకాబోమని తేల్చి చెప్పింది.

ఈ పరిణామాలు కూటమిలో విభేదాలను బయటపెట్టాయి. ఇటీవల, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కీలక మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, టీవీకే విజయ్ మెజారిటీ స్థానాలు సాధించడంతో, ఆ కూటమితో జతకట్టింది. ప్రభుత్వంలో చేరింది. కాంగ్రెస్‌కు ఉన్న 5 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కి మద్దతు తెలిపారు. ఈ పరిణామంతో దశాబ్ధాలుగా ఉన్న డీఎంకే-కాంగ్రెస్ స్నేహానికి బీటలు పడ్డాయి. ఇకపై తాము కాంగ్రెస్‌తో కలిసేది లేదని డీఎంకే తెగేసి చెప్పింది. లోక్‌సభలో తమకు వేరే సీటింగ్ కేటాయించాలని డీఎంకే కోరింది. కాంగ్రెస్‌ తమకు నమ్మకద్రోహం చేసింది, ఇకపై ఆ పార్టీని దగ్గరకు రానిచ్చేది లేదని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. ఇప్పుడు ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉండటంతో, ఆ కూటమి సమావేశానికి వెళ్లేందుకు డీఎంకే ససేమిరా అంటోంది.

×
×
Ad