DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో ‘‘స్టింగ్ ఆపరేషన్’’ వివాదాలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించిన ఒక పారిశ్రామికవేత్త తనను, కేరళ సీఎం వీడి సతీషన్‌ను రహస్యంగా రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. కన్నడ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తనను కలిసిన పారిశ్రామికవేత్త ధరించిన కళ్లద్దాలపై అనుమానం రావడంతో అతడి నేపథ్యం, ఇతర రాజకీయ నాయకులతో ఆయన సమావేశాల గురించి వివరాలు సేకరించాలని అధికారుల్ని ఆదేశించానని డీకే తెలిపారు.
అక్కడే అనుమానం వచ్చింది..
తనను కలిసేందుకు అధికారుల వద్ద నుంచి సదరు పారిశ్రామికవేత్త అపాయింట్మెంట్ తీసుకున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు. ముందుగా వ్యాపార విషయాల గురించి మాట్లాడిన వ్యక్తి, ఆ తర్వాత రాజకీయాల గురించి మాట్లాడటంతో అనుమానం వచ్చిందని సీఎం చెప్పారు. బూత్ స్థాయి వ్యూహాలు, రాజకీయ పరిణామాల గురించి చర్చించడంతో అనుమానం కలిగిందన్నారు.
ఇదే వ్యక్తి కేరళ సీఎం వీడీ సతీషన్‌తో కూడా ఇదే విధంగా మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి సమావేశమయ్యారని డీకే పేర్కొన్నారు. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రితో సమావేశమైనప్పుడు మాత్రం ఈ కళ్లద్దాలు ధరించలేదని ఆరోపించారు.
మంత్రులకు జాగ్రత్తలు..
తనను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాల నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారని డీకే శివకుమార్ తెలిపారు. అయితే, ఈ చర్యల గురించి చెప్పబోమన్నారు. కేబినెట్ మంత్రులు, వారి పీఏలు, ఫోన్ కాల్స్ లేదా ఇతర మార్గాల ద్వారా జరిగే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు చెప్పారు.
సిద్ధరామయ్య స్టింగ్ వీడియోతో కలకలం..
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు సంబంధించిందిగా చెబుతున్న స్టింగ్ ఆపరేషన్ కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వీడియోను ఉపయోగించి సిద్ధరామయ్య ప్రతిష్టను దెబ్బతీసేందుకు, ఆయను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయని కేంద్రమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.
ఇదిలా ఉంటే, పది మంది మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఒక కేంద్రమంత్రి, కర్ణాటక బీజేపీ నేత ఒక ఏజెన్సీకి డబ్బులు ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గని ఆరోపించారు. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. మరోవైపు, సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ను డీకే శివకుమార్ నిర్వహించిందన్న కుమారస్వామి ఆరోపణల్ని డీకే శివకుమార్ ఖండించారు.

