జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ధన్‌ఖర్ సభా కార్యకలాపాలు బాగానే నిర్వహించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించలేదు. సభా కార్యక్రమాల మీటింగ్‌ల్లో కూడా చురుగ్గానే పాల్గొన్నారు. కానీ సాయంత్రానికి ఊహించని రీతిలో అనూహ్యంగా రాజీనామా చేశారు. వాస్తవానికి రాష్ట్రపతిని కలిసి రాజీనామా సమర్పించాలి.. కానీ అలాంటిదేమీ లేకుండా రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపించారు. ఇక్కడే సరికొత్త ఊహాగానాలకు తావిచ్చింది. అంతేకాకుండా కేంద్ర పెద్దల నుంచి కూడా ఎలాంటి స్పందన లభించలేదు. దీంతో పుకార్లు విస్తృతంగా వ్యాప్తి చెందాయి.
ఇది కూడా చదవండి: Supreme Court: బిల్లులపై రాష్ట్రపతికి డెడ్‌లైన్ విధించవచ్చా?, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
అయితే ధన్‌ఖర్-కేంద్రం మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తినట్లుగా సమాచారం అందుతోంది. విభేదాలు, మనస్పర్థలు తారాస్థాయికి చేరడంతో రాజీనామా చేసేలా పరిస్థితులు దారి తీశాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ మేరకు పార్లమెంట్ లాబీల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: UP: సినిమా తరహాలో స్కెచ్.. పగతో 10 ఏళ్ల తర్వాత హత్య.. అసలేం జరిగిందంటే..!
రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కొంత మంది బీజేపీ నేతలే ఆయన చెవుల్లో ఊది అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయాలని ధన్‌ఖర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి గత 6 నెలలుగా ధన్‌ఖర్-ప్రభుత్వం మధ్య నివురుగప్పిన నిప్పులా విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 6 నెలల నుంచి ప్రధాని మోడీతో ఉప రాష్ట్రపతి హోదాలో ధన్‌ఖర్ ముఖాముఖి సమావేశం జరగలేదని చర్చ నడుస్తోంది. ఇక భారత్‌లో అధికారిక పర్యటన చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మర్యాదపూర్వకంగా ధన్‌ఖర్‌ను కలవలేదు. వాస్తవానికి విదేశీ ప్రముఖల పర్యటన సందర్భంగా సమావేశాలు, భేటీలు నిర్వహించేది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖనే.. కానీ ధన్‌ఖర్‌తో జేడీ వాన్స్ సమావేశానికి ఉద్దేశపూర్వకంగానే అనుమతించలేదని వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇక ఉపరాష్ట్రపతి హోదాలో గత ఆరు నెలల్లో జరగాల్సిన విదేశీ పర్యటనలు కూడా రద్దైనట్లు సమాచారం. ఇక అంతిమంగా సోమవారం జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ధన్‌ఖర్ ఆమోదించడంతో విభేదాలు మరింత తారాస్థాయికి చేరినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కారణాలతోనే ధన్‌ఖర్ హఠాత్తుగా రాజీనామా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
