Devendra Fadnavis announces SIT probe into Disha Salian’s death: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతిపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ఈ కేసు ఇప్పటికే ముంబై పోలీసుల పరిధిలో ఉందని.. దీనిపై సిట్ ద్వారా విచారణ జరపుతాం అని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ హత్యపై ఏమైనా ఆధారాలు ఉంటే పోలీసులకు అందించవచ్చని తెలిపారు. ఎవరినీ లక్ష్యం చేసుకోకుండా నిష్ఫక్షపాతంగా విచారణ జరుగుతుందని ఫడ్నవీస్ తెలిపారు.
గురువారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీలో దిశా సాలియన్ మృతిపై సిట్ విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే మాధురీ మిసాల్ డిమాండ్ చేశారు. దిశా సాలియన్ మరణంపై సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే భరత్ గోగావాలే కూడా గళం విప్పారు. బీజేపీ ఎమ్మెల్యే నితీస్ రాణే ఓ అడుగు ముందుకేసి మాజీ మంత్రి సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై తీవ్ర ఆరోపణలు చేశారు. దిశ మరణంతో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందని ఆరోపించారు. దిశా సాలియన్ పోస్టుమార్టం నివేదికను బహిర్గతం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే అమీత్ సతమ్ డిమాండ్ చేశారు.
Read Also: Sreeleela: యంగ్ హీరోయిన్ కి కూడా కటౌట్ పెట్టేసారు…
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ఐదు రోజుల మందు ఆయన మేనేజర్ గా పనిచేసిన దిశా సాలియన్ జూన్8, 2020లో మరణించింది. తనకు కాబోయే భర్తకు చెందిన 14వ అంతస్తు నివాసం నుంచి పడిపోయి మరణించింది. ఈ ఘటన తర్వాత ఐదు రోజులకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మొదటి నుంచి ఈ కేసులో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే నితీస్ రాణే తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఆదిత్య ఠాక్రే. 32 ఏళ్ల యువకుడికి బీజేపీ సర్కార్ భయపడుతోందని.. వారి రాజకీయాలకు ఎలాంటి హద్దులు లేవని అన్నారు. నాపై ఆరోపణలు చేస్తున్నవారికి కూడా కొడుకులు ఉన్నారని.. అయితే వారితో కూడా ఇలాగే చేస్తారా..? అంటూ ప్రశ్నించారు.