RJD: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ-జేడీయూ-ఎల్జేపీల కూటమి 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమి ‘‘మహా ఘట్బంధన్’’ కేవలం 35 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇందులో ఆర్జేడీ 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 6 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆర్జేడీ తన చరిత్రలో రెండో చెత్త ప్రదర్శన చేసింది. అంతకుముందు, 2010లో కేవలం 22 సీట్లు వచ్చాయి.
అయితే, ఓ విషయంలో మాత్రం ఆర్జేడీ ఇతర పార్టీలకు అందకుండా నిలిచింది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం, బీహార్ ఎన్నికల్లో 143 సీట్లలో పోటీ చేసి 25 స్థానాలు గెలుచుకున్న ఆర్జేడీ పార్టీ 23 శాతం ఓట్లను సంపాదించింది. 2020 ఎన్నికలతో పోలిస్తే 23.11 ఓట్ల శాతం నుంచి స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూల కన్నా అత్యధిక ఓట్లను సంపాదించింది.
అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 1.15 కోట్ల (1,15,46,055) మంది ప్రజలు ఆర్జేడీకి ఓటేశారు. 89 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి 20.08% ఓట్లను సాధించింది, ఇది 2020లో 19.46% కన్నా ఎక్కువ. 1,00,81,143 మంది కమలానికి ఓటేశారు. నితీష్ కుమార్ జేడీయూ 101 సీట్లలో పోలీ చేసి 85 సీట్లను గెలుచుకుంది. 2020లో సంపాదించిన 15.39 % నుండి ఈసారి 19.25%కి పెంచుకుంది. 19.25% ఓట్ల శాతం అంటే, 96,67,118 ఓట్లను సంపాదించింది.
ఓటమి కారణం ఇదే:
అయితే, ఆర్జేడీ ఒంటరిగా ఎక్కువ ఓట్లను సంపాదించినప్పటికీ కూటమిగా దారుణంగా విఫలమైంది. ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ‘‘మహా ఘట్బంధన్’’ కూటమికి 35.89% ఓట్లు వచ్చాయి. ఇక ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చాలు కలిసి 46-47 శాతం ఓట్లను సాధించాయి. దీంతో, ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
సరళంగా చెప్పాలంటే, ఓట్ల శాతం అంటే ఆ పార్టీకి ఎంత మంది ఓటేశారో చెప్పే ఒక లెక్క. ఆర్జేడీ గెలుచుకున్న స్థానాల్లో ఎక్కువ ఓట్లు పొంది ఉండొచ్చు. కొన్ని చోట్ల రెండో పార్టీగా ఉండొచ్చు. గట్టి పోటీ ఇవ్వవచ్చు, కానీ గెలవలేకపోయి ఉండొచ్చు. దీంతో ఆర్జేడీకి ఎక్కువ మంది ఓట్లు వేసినప్పటికీ అది సీట్లుగా మారలేదని తెలుస్తోంది.
