Munawar Faruqui: స్టాండ్ ఆప్ కమెడియన్ మునావర్ ఫరూఖీని గ్యాంగ్ స్టర్లు రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్‌లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. హిందూ దేవుళ్లపై జోకులు వేయడం ద్వారా మునావర్ వారికి హిట్ లిస్టులోకి వచ్చాడు. హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్న మునావర్ ఫరూఖీ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రకు పాల్పడిన కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం భగ్నం చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.
హర్యానాలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితులైన రాహుల్, సాహిల్ అనే షూటర్లు ఇటీవల ఢిల్లీలో కనిపించారని ఢిల్లీ పోలీసు కౌంటర్-ఇంటెలిజెన్స్ బృందానికి సమాచారం అందిందని సోర్సెస్ వెల్లడించాయి. ఇద్దరిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్లాన్ చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో, కాల్పులు జరిపి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసులు వీరిని అరెస్ట్ చేసి, వీరి వద్ద నుంచి తుపాకులు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Minister Kandula Durgesh: జనసేన ఆత్మీయ సమావేశం.. మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..
పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మునావర్ ఫరూఖీ లక్ష్యంగా బాంబే, బెంగళూర్ లాంటి నగరాల్లో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. బెంగళూర్ లో ఫరూఖీ ఓ ఈవెంట్ కు వచ్చినప్పుడు, అతడిని టార్గెట్ చేశారు. అయితే, ఫరూఖీ వేరు కారులో వెళ్లడంతో అప్పుడు ప్లాన్ విఫలమైంది. తిరిగి ఢిల్లీలో ఫరూఖీని టార్గెట్ చేయాలని చూసినప్పుడే, ఇద్దరు షూటర్లు పోలీసులకు దొరికారు.
2021లో మధ్యప్రదేశ్‌లో ఫరూకీ హిందూ దేవళ్లపై కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక నెల జైలులో ఉన్న తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కూడా ఇతడికి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
