Site icon NTV Telugu

Delhi Shocking: గుంతలో యువకుడి మృతి కేసులో దిగ్భ్రాంతికర విషయాలు..!

Delhi

Delhi

దేశ రాజధాని ఢిల్లీలో గుంతలో పడి మరణించిన కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనక్‌పురిలో నడిరోడ్డుపై ఢిల్లీ జల్ బోర్డు భారీ గుంత తవ్వి.. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా.. బారికేడ్లు లేకుండా.. సైన్ బోర్డులు.. లైటింగ్ లేకుండా వదిలేశారు. కనీసం భద్రతగా సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టలేదు. దీంతో కమల్ ధ్యాని అనే యువకుడు గుంతలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

అయితే ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని జనక్‌పురిలో 25 ఏళ్ల కమల్ ధ్యాని బైక్‌తో పాటు గుంతలో పడిపోవడాన్ని ఒక కుటుంబం చూసింది. వెంటనే టెంట్‌లో కూర్చుని ఉన్న సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇచ్చారు. ఆ గార్డ్ వెంటనే సబ్ కాంట్రాక్టర్ రాజేష్ ప్రజాపతికి సమాచారం అందించాడు. వెంటనే వచ్చి ఒక వ్యక్తి.. బైక్‌తో పాటు గుంతలో ఉన్నట్లు చూశాడు. కానీ రక్షించే ప్రయత్నం చేయలేదు. చూసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కనీసం పోలీసులకైనా సమాచారం ఇవ్వకుండా ఇంటికి వెళ్లిపోయాడు. పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… రాజేష్‌తో పాటు సహా బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. రాజేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తు్న్నారు.

స్థానికుల ఆందోళన
ప్రమాద స్థలంలో ఎటువంటి హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.. రాత్రిపూట చీకటిగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పేర్కొన్నారు.

ఇక ఈ ఘటనపై ఆప్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ధ్వజమెత్తారు. ‘‘ఒక అమాయక బైకర్ లోతైన గుంతలో పడి రాత్రంతా అక్కడే ఉండి చనిపోయాడని.. నోయిడా సంఘటన నుంచి బీజేపీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదు. వారు ప్రతిరోజూ అబద్ధాలు చెబుతారు.’’ అని పేర్కొన్నారు.

 

 

Exit mobile version