దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వియా నగర్ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా విదేశాల నుంచి వైద్యం కోసం వచ్చి హస్తినలో ప్రాణాలు పోగొట్టుకోవడం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. దాదాపు ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా.. ఎందరో క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాపం.. పుణ్యం ఎరుగని అమాయకులు బలి కావాల్సి వచ్చింది. స్థానికులు చేసిన సాయం మాత్రం మెచ్చుకో తగ్గ విషయం. ఓ మాతృమూర్తి కోసం కన్న కొడుకు కాలేయం దానం చేశాడు. కానీ చివరికి అగ్నిప్రమాదంలో ఇద్దరూ సజీవదహనం అయ్యారు. ఈ ఘటన కన్నీళ్లు రప్పిస్తున్నాయి. తాజాగా విషయంలో వెలుగులోకి వచ్చింది. అందరికీ కన్నీళ్లు రప్పిస్తున్నాయి.
కిర్గిజ్‌స్తాన్‌కు చెందిన 53 ఏళ్ల నర్గిసా ఖాన్ చాలా కాలంగా కాలేయ సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో వైద్యులు కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంట్) మాత్రమే పరిష్కారమని సూచించారు. అయితే సరైన దాత దొరకక కుటుంబం నెలల తరబడి ఆందోళన చెందింది. ఈ క్రమంలో నర్గిసా 26 ఏళ్ల కుమారుడు హుమాయున్ కాలేయ దాతగా వైద్యపరంగా సరిపోతాడని తేలింది. దీంతో తల్లిని కాపాడేందుకు సందేహించకుండా తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేయడానికి ముందుకొచ్చాడు. దీంతో నర్గిసా, హుమాయున్, కుటుంబ పెద్ద 75 ఏళ్ల మఖ్‌పిరాత్ కలిసి ఢిల్లీకి వచ్చారు.
ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతంగా పూర్తైంది. కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. నర్గిసా ఆరోగ్యం మెరుగుపడటంతో ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆస్పత్రికి సమీపంలోని మాల్వియా నగర్ హోటల్‌లో బస చేస్తూ కోలుకుంటున్నారు. స్వదేశంలోని బంధువులతో మాట్లాడి శస్త్రచికిత్స విజయవంతమైందని ఆనందాన్ని పంచుకున్నారు. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. బుధవారం ఉదయం గెస్ట్ హౌస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు భవనమంతా వ్యాపించాయి. అనేక మంది ప్రాణాలు కాపాడుకోగా.. మరికొందరు నిస్సహాయస్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది మృతి చెందగా.. నర్గిసా, ఆమె కుమారుడు హుమాయున్, అమ్మమ్మ మఖ్‌పిరాత్ కూడా ఊపిరి వదిలారు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
చివరి ఫోన్ కాల్
భారత్‌లో నివసిస్తున్న కుటుంబ బంధువు గుజల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8:53 గంటలకు నర్గిసా నుంచి తనకు ఫోన్ వచ్చింది. హోటల్‌లో మంటలు చెలరేగాయంటూ ఆమె కేకలు వేస్తూ మాట్లాడిందని, అనంతరం కాల్ కట్ అయిందని చెప్పారు. రెండు నిమిషాల తర్వాత తిరిగి కాల్ చేసినా స్పందన రాలేదని తెలిపారు. ఘటనాస్థలానికి చేరేసరికి భవనం మొత్తం మంటల్లో చిక్కుకుపోయిందని, పోలీసులను వేడుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి అదుపు తప్పిందని గుజల్ ఆవేదన వ్యక్తం చేశారు.
మృతదేహాలను బయటకు తీసిన తర్వాత హుమాయున్, నర్గిసాలను గుర్తించినట్లు గుజల్ తెలిపారు. దిగువ అంతస్తుల సమీపంలో కనిపించారని, మంటల నుంచి తప్పించుకోవడానికి కిందికి పరుగెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. నర్గిసా మెడకు బ్యాగ్ కూడా వేలాడుతూ కనిపించిందని.. చివరి క్షణాల్లో కూడా పాస్‌పోర్టులు, డబ్బులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించి ఉండొచ్చని అన్నారు.
తల్లి ప్రాణాలను కాపాడేందుకు కుమారుడు చేసిన త్యాగం విజయవంతమైనప్పటికీ.. కొద్ది రోజుల వ్యవధిలోనే మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు అగ్నిప్రమాదంలో మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. ఇప్పుడు నర్గిసా కోలుకుని స్వదేశానికి వెళ్లాల్సిన బదులు.. ముగ్గురి మృతదేహాలను కిర్గిజ్‌స్తాన్‌కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది.

