Dhruv Rathee: రాముడు-సీతలపై వ్యాఖ్యలు.. ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపుపై హైకోర్టు డెడ్‌లైన్

  • ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపు అంశంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.
  • 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీకి ఆదేశం.
  • కోర్టు ఆదేశాలను పాటించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిక.
  • వీడియోలో హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
Dhruv Rathee

Dhruv Rathee

Dhruv Rathee: హిందూ దేవీదేవతలు శ్రీరాముడు-సీతాదేవిపై యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చేసిన వీడియోపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీరాముడు, సీత, శ్రీ కృష్ణుడు మాంసం, మద్యం సేవించారని ధ్రువ్ రాఠీ ఒక వీడియోలో కామెంట్స్ చేశాడు. ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ప్రభుత్వ గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.

మార్చి 21 ధ్రువ్ రాఠీ చేసిన ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ‘‘Can Hindus Eat Beef? | Kerala Story 2 Exposed’’ పేరుతో వీడియో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోలో హిందూ దేవతలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతా దేవి మాసం తిన్నారని, మద్యం సేవించారని ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు మతపరమైన భావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తమైంది.

విచారణ సందర్భంగా, కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) చేతన్ శర్మ, యూట్యూబ్ తగిన జాగ్రత్తలు తీసుకుని, అభ్యంతరకరమైన, విద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్‌గా ఆరోపించబడిన దానిని వెంటనే తొలగించి ఉండాల్సిందని వాదించారు. ధ్రువ్ రాఠీ చేసని కంటెంట్ హానికరమైందిగా, విభజనను కలిగించేదిగా కోర్టుకు తెలిపారు. వీడియోను తొలగిస్తామని గూగుల్ కోర్టుకు తెలియజేయాలని, లేదా డివిజన్ బెంచ్ చేసిన పరిశీలనల ఆధారంగా కోర్టు ముందుకు సాగవచ్చని ఆయన వాదించారు.

గూగుల్ తరుఫున హాజరైన న్యాయవాది పిటిషనర్‌కు ఇప్పటికే తమ సమాధానం అందజేశామని, ఈ అంశంపై గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ ముందు అప్పీల్ కూడా దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న తర్వాత జస్టిస్ స్వర్ణ కాంత శర్మ, అప్పీల్ పై 15 రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీని ఆదేశించారు. ఈ పిటిషన్‌ను అడ్వకేట్ అమితా సచ్‌దేవా దాఖలు చేశారు. ధ్రువ్ రాఠీ మార్చి 21న అప్‌లోడ్ చేసిన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాలని ఆమె కోరారు.