2020 Delhi riots: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో కుట్రకు సంబంధించి యాక్టివిస్టులు, జేఎన్‌యూ మాజీ విద్యార్థులు అయిన ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లో పాటు మరో ఏడుగురికి ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. జస్టిస్ నవీన్ చావ్లా, షాలిందర్ కౌర్‌తో కూడిన ధర్మాసనం ఈ ఇద్దరితో పాటు మొహమ్మద్ సలీమ్ ఖాన్, షిఫా ఉర్ రెహమాన్, అథర్ ఖాన్, మీరాన్ హైదర్, షాదాబ్ అహ్మద్ అబ్దుల్ ఖలీద్ సైఫీ, గుల్ఫిషా ఫాతిమా బెయిల్ పిటిషన్‌లను కూడా తోసిపుచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇమామ్, ఖలీద్‌ల బెయిల్ పిటిషన్ 2022 నుంచి పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం, హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని వీరి తరుపు న్యాయవాది చెప్పారు.
Read Also: Tesla: కేవలం 600 ఆర్డర్లే.. టెస్లా కార్‌లపై ఇంట్రెస్ట్ చూపని భారతీయులు..
పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై ఫిబ్రవరి 2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత హింసకు దారితీసిన పెద్ద కుట్రలో ఇమామ్, ఖలీద్ కీలకంగా ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ హింసలో 50 మందికి పైగా మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ మతహింసకు ఈ ఇద్దరు ప్రధాన సూత్రధారులని ఢిల్లీ పోలీసులు వీరిపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల(నివారణ) చట్టం(UAPA) కింద అభియోగాలు మోపారు. 2020 సెప్టెంబర్ నుంచి ఖలీద్ జైలులోనే ఉన్నాడు. గతేడాది కుటుంబంలో ఒక వివాహానికి హాజరుకావడానికి 7 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరైంది.
తాజాగా సుప్రీంకోర్టు విచారణలో తాము ఇప్పటికే నాలుగు ఏళ్లుగా కస్టడీలో ఉన్నామని వాదించారు. అయితే, ప్రభుత్వం తరుపున వాదించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వీరి బెయిల్‌ని వ్యతిరేకించారు. ఈ అల్లర్లు దుష్ట పన్నాగంగా ప్లాన్ చేశారని, ఇది బాగా ఆలోచించిన కుట్రగా అభివర్ణించారు. ‘‘ మీరు దేశానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, మీరు నిర్దోషిగా విడుదలయ్యచే వరకు జైలులోనే ఉండటం మంచిది’’ అని అన్నారు. మరోవైపు, షార్జీల్ ఇమామ్ తాను ఢిల్లీ పోలీసులు ఆరోపించినట్లు కుట్రలో భాగం కాలేదని వాదించాడు. తన ప్రసంగాలు, వాట్సాప్ చాట్స్ ఎప్పుడూ ఎలాంటి అశాంతికి దారి తీయలేదని చెప్పారు.